English | Telugu
ఏపీ రాజధానిపై మళ్లీ మొదలైన రగడ!!
Updated : Nov 6, 2019
ఏపీ రాజధాని పై మరోసారి రగడ మొదలైంది. బంగారు గుడ్లు పెట్టే బాతు లాంటి అమరావతిని చంపేశారంటూ ఓ వైపు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే విమర్శలు చేస్తున్నారు. మరోవైపు.. అసలక్కడ ఏముంది అంటూ చంద్రబాబును ప్రశ్నిస్తున్నారు మునిసిపల్ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇక బొత్స విమర్శలకు టిడిపి నేతలు కౌంటర్లిస్తున్నారు. అమరావతిలో ఏముందో తమ హయాంలో ఏమేం నిర్మించామో ప్రజలకు చూపిస్తామంటూ టిడిపి నేతలు అమరావతి పర్యటనకు వెళ్లారు. మాజీ మునిసిపల్ మంత్రి నారాయణ, మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, దేవినేని ఉమా నాయకత్వంలో పలువురు తెలుగుదేశం నాయకులూ ఉండవల్లి కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం నుంచి అమరావతికి వెళ్లారు. కొందరు బస్సులో మరికొందరు కార్లలోనూ తెలుగుదేశం నాయకులు అమరావతికి చేరుకున్నారు.
రాజధాని సమగ్రాభివృద్ధి రాష్ట్రంలో పట్టణాభివృద్ధికి సూచనలు చేయాలంటూ జగన్ ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీ ప్రజల నుంచి అభిప్రాయాలను తీసుకుంటోంది. అయితే కమిటీ నియామకం పై మండిపడ్డారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. కమిటీతో ఏం చేశారంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. కేసుల్లో ఉన్నవారు అవినీతి గురించి మాట్లాడుతున్నారంటూ ఆయన సెటైర్లు వేశారు. నిన్న గాజువాకలో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పులివెందులలో రాజధానిని, అక్కడికి దగ్గర లో ఉండే కర్నూలులో హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ వ్యంగ్యాస్త్రాలు సందించారు. పవన్, చంద్రబాబు చేస్తున్న కామెంట్స్ కు వైసీపీ నేతలు కూడా ధీటుగా కౌంటర్లు ఇస్తున్నారు.