English | Telugu

జగన్ మాయ.. అందుకే మూడు రాజధానుల ముచ్చట!!

ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ గుంటూరు జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్ కు పిలుపునిచ్చింది విద్యార్థి జేఏసీ. అమరావతి పరిరక్షణ సమితి విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. ప్రధాన ప్రాంతాల్లో నిరసనలకు దిగి స్కూల్స్, కాలేజీ బస్సులను అడ్డుకున్నారు. మూడు రాజధానుల ప్రకటన చేసి ముఖ్యమంత్రి ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారన్నారని అన్నారు. అమరావతి లోనే రాజధాని కొనసాగిస్తామని ప్రకటన చేసేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు విద్యార్థి జేఏసీ. ఒక్కసారి అవకాశం కలిపిస్తే రాష్ట్రాన్ని ఉద్దరిస్తానని జగన్ మోహన్ రెడ్డి చెప్పారని.. కానీ భారతదేశంలో ఇంత అమానుషమైన ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. భారతదేశ ప్రజలందరూ సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదనను వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక నవరత్నాలను తప్పకుండా అమలుపరుస్తానని జగన్ జనాన్ని మభ్యపెట్టారని అన్నారు. నవరత్నాలను మరిపించడానికే మూడు రాజధానుల గోల పెట్టారని అన్నారు. రైతుల త్యాగాలను అపహాస్యం చేస్తూ ఆందోళనలకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో చేస్తున్న ధర్నాలకు ఎటువంటి అనుమతి లేదన్నారు తుళ్లూరు అడిషనల్ ఎస్పీ చక్రవర్తి.