English | Telugu
ఆర్టీసీని ఇంకెంత కాలం ఆదుకోవాలి? హైకోర్టులో ప్రభుత్వం స్ట్రాంగ్ అఫిడవిట్
Updated : Nov 11, 2019
ఆర్టీసీ సమ్మె విషయంలో హైకోర్టు నుంచి పదేపదే బౌన్సుర్లు, పంచ్ లు ఎదుర్కొంటున్న తెలంగాణ ప్రభుత్వం తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. ఆర్టీసీ స్థితిగతులు, బకాయిలపై హైకోర్టుకు నివేదిక సమర్పించిన కేసీఆర్ సర్కారు... వాస్తవ పరిస్థితిని ఉన్నదున్నట్లు ఉన్నత న్యాయస్థానం ముందుంచింది. 2019 ఆగస్ట్ నాటికి ఆర్టీసీ 5వేల 269కోట్ల నష్టాల్లో ఉందన్న ప్రభుత్వం.... వివిధ వర్గాలకు 2వేల 209కోట్ల రూపాయలు బకాయి పడిందని లెక్కలతో సహా వివరించింది.
ఆర్టీసీ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని, ఇంకెంత కాలం ఆర్టీసీని ఆదుకోవాలంటూ ప్రభుత్వం తన నివేదికలో వ్యాఖ్యానించింది. ఆర్టీసీ.... వివిధ వర్గాలకు 2వేల 209కోట్ల రూపాయలు బకాయి పడిందన్న ప్రభుత్వం... ఆ లెక్కలను హైకోర్టు ముందు పెట్టింది. పీఎఫ్ బకాయిలు 788కోట్లు, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బకాయిలు 500కోట్లు, లీవ్ ఎన్-క్యాష్-మెంట్ బకాయిలు 180కోట్లు, రిటైర్డ్ ఎంప్లాయీస్ సెటిల్మెంట్ల బకాయిలు 52కోట్లు ఉన్నాయని తెలిపింది. ఇక, మోటారు వెహికల్ యాక్టు కింద 452కోట్లు, హెచ్ఎస్‌డీ ఆయిల్ బిల్స్ 34కోట్లు, హెచ్‌వో రీజియన్, జోన్ బకాయిలన్నీ కలిపి 36కోట్లు ఉన్నాయని లెక్క చూపింది. అలాగే, అద్దె బస్సులకు 25కోట్ల ఇవ్వాల్సి ఉందని నివేదికలో వివరించింది. అసలు సంస్థ ఉద్యోగులకే ఆర్టీసీ యాజయాన్యం 15వందల 21కోట్ల రూపాయిల బకాయి పడిందని లెక్కలు చెప్పింది. ఇక, కాలం చెల్లిన 2వేల 609 బస్సులను మార్చాలంటే 750కోట్లు అవసరమని ప్రభుత్వం తెలిపింది. వచ్చే మార్చి నాటికి మరో 476 బస్సులు కాలం చెల్లుతాయని, అలాగే ఆర్టీసీ బస్సుల మరమ్మతు బకాయిలు 60లక్షలు ఉందని ప్రభుత్వం తన అఫిడవిట్‌లో తెలియచేసింది.
ఆర్టీసీ ఆర్ధిక పరిస్థితి అంతా యూనియన్లకు తెలుసంటోన్న ప్రభుత్వం.... ఆర్టీసీకి 47కోట్లు ఇవ్వాలన్న కోర్టు సూచనను సానుకూలంగా పరిశీలించామని, అయితే కేవలం 47కోట్లతో సమస్య పరిష్కారమయ్యేలా కనిపించడం లేదని, అయినా ఆర్టీసీని ఇంకా ఎన్నిసార్లు, ఎంతకాలం ఆదుకోవాలంటూ స్ట్రాంగ్ అఫిడవిట్ దాఖలు చేసింది ప్రభుత్వం. అయితే, ప్రభుత్వం తప్పుడు లెక్కలు చెబుతోందని, రీఎంబర్స్‌మెంట్ ద్వారా ఆర్టీసీకే 2వేల 2వందల కోట్లకుపైగా రావాల్సి ఉందంటున్నారు కార్మిక సంఘాల నేతలు. మరి ప్రభుత్వ అఫిడవిట్ పై హైకోర్టు ఎలా రియాక్టవుతుందో చూడాలి.