English | Telugu

రంజాన్ నెల‌లో లాక్‌డౌన్ నిబంధ‌న‌లు క‌ఠినంగా పాటించాల్సిందే! అబ్బాస్ నఖ్వీ

కరోనా మహమ్మారి విసురుతున్న ప్ర‌మాద‌క‌ర‌మైన‌ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు సామాజిక దూరం మార్గదర్శకాలను నిజాయితీతో క‌చ్చితంగా పాటించాలని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పిలుపునిచ్చారు. ఈ నెల 24 నుంచి ప‌విత్ర రంజాన్ మాస‌ము ప్రారంభం కానుంది. ముస్లింలు ఇంటిలోనే మతపరమైన ఆచారాల‌ను నిర్వ‌హించుకోవాల‌ని ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి నేప‌థ్యంలో ప్ర‌పంచ‌ వ్యాప్తంగా సౌదీ అరేబియాతో సహా చాలా ముస్లిం దేశాలు రంజాన్ సంద‌ర్భంగా మతపరమైన ప్రదేశాలలో ప్ర‌వేశాల‌ను నిలిపివేసిన విష‌యాన్ని ముస్లింలు గమనించాల‌ని మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు.

దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర వక్ఫ్ బోర్డుల పరిధిలో దాదాపు 7 లక్షలకు పైగా రిజిస్టర్డ్ మసీదులు, ఈద్గా, ఇమాంబాడా, దర్గాలు మరియు ఇతర మత సంస్థలు ఉన్నాయ‌ని ఆయ‌న తెలియ జేశారు. ప్రజలు గుమిగూడకుండా చూసేందుకు సమర్థవంతమైన విధానాన్ని తీసుకోవాలని రాష్ట్ర వక్ఫ్ బోర్డులను సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ ద్వారా సూచించినట్లు మంత్రి నఖ్వీ తెలిపారు.

ఈ విషమై అవ‌స‌ర‌మైతే వివిధ మత, సామాజిక సంస్థలు, ప్రజలు, స్థానిక యంత్రాంగ‌పు యొక్క సాయం తీసుకోవలసిన అవసరం ఉంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. సామాజిక దూరం నిబంధ‌న‌లు కఠినంగా సమర్థవంతంగా అమల‌య్యేలా ముస్లింలు సహకరించాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని ఆయ‌న అన్నారు. “ఇఫ్తార్”తో సహా ఇతర మతపరమైన ఆచారాల విష‌యంలో ప్ర‌భుత్వం సూచిస్తున్న అన్ని మార్గదర్శకాలను పాటించాలని ఆయన కోరారు.