English | Telugu

భోగాపురానికి జగన్ ఎందుకు జైకొట్టారు? ఇక్కడ ప్రజాధనం ఆదా చేయరా?

టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను తిరగదోడుతూ విస్తృత అధికారాలు కల్పిస్తూ సిట్ ను నియమించిన జగన్ ప్రభుత్వం.... కొన్నింటికి మాత్రం జైకొడుతోంది. మొదట భారీ దోపిడీ జరిగిందంటారు. కేవలం దోపిడీ కోసమే ఆ నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడితే చాలు చంద్రబాబు నిర్ణయాలపై దుమ్మెత్తిపోస్తారు. తీవ్ర విమర్శలు చేస్తారు. సరే, విచారణ సిద్ధమా? అంటే చాన్నాళ్లవరకు నోరు మెదపరు. పోలవరం ప్రాజెక్టు దగ్గర్నుంచి... అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్ వరకు ఇదే తంతు. ప్రతిపక్షంలో ఉండగా తీవ్ర ఆరోపణలు చేసిన ప్రాజెక్టుల విషయంలోనూ జగన్ ప్రభుత్వం మాట మార్చింది.

పోలవరం ప్రాజెక్టుపై వైసీపీ విమర్శలనే చూద్దాం, ఆనాడు పోలవరం అంచనాలను చంద్రబాబు పెంచినప్పుడు భారీ దోపిడీ కోసమేనంటూ జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ నేతలంతా విమర్శించారు. చివరికి కేంద్రానికి సైతం ఫిర్యాదులు చేశారు. చివరికి ఏం జరిగింది? జగన్ అధికారంలోకి వచ్చాక, అవే అంచనాలను ఆమోదించాలంటూ కేంద్రాన్ని కోరారు. ఇక, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు విషయంలోనూ అదే జరిగింది. జీఎంఆర్ కు లబ్ది చేకూర్చేవిధంగా నిర్ణయం తీసుకున్నారంటూ విమర్శించారు. టెండర్ నిబంధనల్లో పలు ఉల్లంఘనలు జరిగాయని పెద్దఎత్తున ఆరోపణలు చేశారు. సీన్ కట్ చేస్తే, నిన్న జరిగిన మంత్రివర్గ సమావేశంలో జీఎంఆర్ కు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. దాంతో, జగన్ సర్కారు తీరుపై విస్మయం వ్యక్తంచేస్తున్నారు.

ప్రజాధనం ఆదా చేస్తున్నామని చెబుతున్న జగన్ ప్రభుత్వం.... ప్రతిపక్షంలో ఉండగా, పెద్దఎత్తున విమర్శలు చేసిన జీఎంఆర్ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కాంట్రాక్టు విషయంలో మాత్రం ఎందుకు రివర్స్ టెండరింగ్ కు వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. పైగా చంద్రబాబు నిర్ణయానికి జగన్ ఎందుకు జైకొట్టారని నిలదీస్తున్నారు. అయితే, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు.... జగన్ తో పలుమార్లు సంప్రదింపులు జరిపారని, అందుకే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం విషయంలో సానుకూల నిర్ణయం తీసుకున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. అయితే, చంద్రబాబు నిర్ణయాలన్నింటినీ తిరగదోడుతూ, సిట్ దర్యాప్తునకు ఆదేశించిన జగన్మోహన్ రెడ్డి... కొన్నింటికి మాత్రం ఎందుకు జైకొడుతున్నారనేది అనుమానాలు రేపుతోంది.