English | Telugu
ఆంధ్రప్రదేశ్ ను వెనక్కినెట్టిన తెలంగాణ.. సింగిల్ డేలో పవర్ ఫుల్ రికార్డు...
Updated : Feb 29, 2020
తెలంగాణ విద్యుత్ శాఖ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉమ్మడి ఏపీలో కూడా సాధ్యంకాని రికార్డును తెలంగాణ రాష్ట్రం సాధించింది. తెలంగాణలో ఒక్కరోజే 13వేల 168 మెగావాట్ల అత్యధిక వినియోగం జరిగింది. ఇంత పెద్దఎత్తున డిమాండ్ ఏర్పడినా, ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సంస్థలు పవర్ సప్లై చేసి సరికొత్త చరిత్ర సృష్టించాయి. 23 జిల్లాల ఉమ్మడి ఏపీ చరిత్రలో 2014 మార్చి 23న అత్యధికంగా 13వేల 132 మెగావాట్ల విద్యుత్ వినియోగం జరగగా, ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే అంతకు మించిన వినియోగంతో 2020 ఫిబ్రవరి 20న రికార్డు నెలకొల్పింది.
2014లో తెలంగాణ రాష్ట్రం మొత్తం 47వేల 338 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం ఉండగా, 2018-19లో అది 68వేల 147 మిలియన్ యూనిట్లకు పెరిగింది. అంటే, ఆరేళ్లలో దాదాపు 44శాతం వినియోగం పెరిగింది. అదే సమయంలో దేశ సగటు మాత్రం 23శాతంగా మాత్రమే నమోదైంది. ప్రపంచంలో ప్రగతి సూచికలుగా గుర్తించే అంశాల్లో తలసరి విద్యుత్ వినియోగం ఒకటి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్రం... దేశ సగటునే మించిపోయింది. దేశవ్యాప్తంగా సగటు తలసరి విద్యుత్ వినియోగం 11వందల 81 మెగావాట్లు కాగా, తెలంగాణలో మాత్రం 18వందల 96 మెగావాట్లుగా ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తలసరి విద్యుత్ వినియోగం 13వందల 56 మెవావాట్లుంటే.... అది ఆరేళ్లలో 39.82శాతం పెరిగింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక, టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అనేక విప్లవాత్మక నిర్ణయాలతో విద్యుత్ వినియోగం అంతకంతకూ పెరుగుతూ వచ్చింది. ఇక, 2018 జనవరి 1నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంపు సెట్లకు 24గంటల విద్యుత్ సరఫరా జరుగుతోంది. తెలంగాణ ఏర్పడే నాటికి, రాష్ట్రంలో 19లక్షలకు పైగా పంపు సెట్లు ఉంటే, ఇప్పుడు 24లక్షలకు పైగా కనెక్షన్లు ఉన్నాయి. ఇక, 2014లో ఎత్తిపోతల పథకాలకు కేవలం 680 మెగావాట్ల డిమాండ్ ఉండగా, అదిప్పుడు 2వేల200 మెగావాట్లకు పెరిగింది. అయితే, ప్రభుత్వం చేపట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుల కారణంగా ఇది మరింత పెరిగే అవకాశముంది.
ఇక, తెలంగాణ రాష్ట్రం ఏర్పడకుముందు, పరిశ్రమలకు పవర్ హాలీడేస్ ప్రకటించే పరిస్థితి ఉండగా, ఇప్పుడు, 24గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతోంది. పట్టణీకరణ, వ్యవసాయ, పారిశ్రామికాభివృద్ధితో వ్యాపార, వాణిజ్య కనెక్షన్లు భారీగా పెరిగాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి కోటీ 11లక్షలకు పైగా వివిధ రకాల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, ఇప్పుడది కోటీ 54లక్షలు దాటింది. అంటే, విద్యుత్ కనెక్షన్లలో 38.61శాతం వృద్ధి నమోదైంది. ఇక, తెలంగాణ ఏర్పడే నాటికి 233 సబ్ స్టేషన్లుంటే, అవిప్పుడు 347కి చేరాయి. ఇక, తెలంగాణ రాష్ట్రం వచ్చేనాటికి స్టేట్‌లో 7వేల 78 మెగావాట్ల స్థాపిత విద్యుత్ మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడది 16వేల 246 మెగావాట్లకు చేరిందని, అలాగే, అప్పుడు 74 మెగావాట్ల సోలార్ పవర్ మాత్రమే అందుబాటులో ఉంటే, ఇప్పుడు 3వేల 650 మెగావాట్లకు పెరిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగం... ఇప్పుడు ఇంత గొప్పగా రూపాంతరం చెందడానికి ఒక్కరోజులో జరిగిన అద్భుతం కాదని, దీని వెనుక ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శనం, అనుక్షణ పర్యవేక్షణ, విద్యుత్ ఉద్యోగుల కృషి ఉందని జెన్ కో అండ్ ట్రాన్స్ కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు అన్నారు. ఇక, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ ప్లాంట్ల నిర్మాణాన్ని శరవేగంగా పూర్తిచేసి, తెలంగాణ రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ కలను త్వరలోనే నిజం చేస్తామన్నారు.