English | Telugu
పోలవరం ప్రాజెక్టుకు లైన్ క్లియర్ :- రివర్స్ టెండరింగ్ పై స్టే ఎత్తివేత
Updated : Nov 1, 2019
పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విషయంలో హై కోర్టు స్టే ఎత్తివేసింది. రివర్స్ టెండర్ వేసిన మేఘా ఇంజనీరింగ్ కంపెనీతో ఒప్పందం చేసుకోవడానికి అవకాశం కల్పించింది. ప్రతిపక్షానికి ఎదురు దెబ్బ తగిలిందని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. పోలవరంలో హైడల్ ప్రాజెక్టు కాంట్రాక్టు రద్దు చేసి రివర్స్ టెండరింగ్ కు వెళ్లాలన్నా ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ నవయుగ సంస్థ దాఖలు చేసిన పిటిషన్ పై గతంలో దిగువ కోర్టు విధించిన స్టేను హై కోర్టు ఇవాళ ఎత్తివేసింది. దీంతో ప్రాజెక్టు పనులకు గ్రీన్ సిగ్నల్ లభించింది. ఆర్బిట్రేషన్ ప్రక్రియ మొదలైన తరువాత రిట్ పిటిషన్ కు విలువ ఉండదని అడ్వకేట్ జనరల్ వాదనతో హై కోర్టు ఏకీభవించదని మంత్రి అనిల్ కుమార్ ప్రకటించారు.
బ్యాంక్ గ్యారెంటీలను ఎన్ క్యాష్ చేయకూడదంటూ దిగువ కోర్టు ఇచ్చిన ఇంజక్షన్ ఆర్డర్ ను కూడా హై కోర్టు పక్కన పెట్టింది. హై కోర్టు తీర్పును స్వాగతించిన మంత్రి అనిల్ కుమార్ గోదావరిలో వరద తగ్గు ముఖం పట్టిన వెంటనే పోలవరం ప్రాజెక్టు పనులు మొదలు పెడతామని ప్రకటించారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజా ధనాన్ని ఆదా చేస్తున్నామన్నారు. హై కోర్టు తీర్పు ప్రతిపక్షానికి ఎదురుదెబ్బ అని ఇప్పటికైనా ప్రాజెక్టు నిర్మాణం పై విమర్శలు మానుకోవాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులు గత ఐదు నెలలుగా నిలిచిపోయాయి. వరదల సమయంలో పనులు జరగవని ప్రభుత్వం చెబుతునే ఉంది. ఇప్పుడు కూడా మరో రెండు నెలల పాటు ప్రారంభమయ్యే అవకాశాలు లేవన్న ప్రచారం జరుగుతోంది. మేఘా సంస్థతో రివర్స్ టెండరింగ్ తో ఒప్పందం చేసుకోవాల్సి ఉంది.
ఇలా చేసుకోవాలంటే పోలవరం ప్రాజెక్టు అథారిటీ పర్మిషన్ తీసుకోవాలి. గత పీపీఏ సమావేశంలో జరగాల్సిన పనులకు రివర్స్ టెండర్ లలో పిలిచిన పనులకు మధ్య తేడాను గుర్తించారు. ఈ క్రమంలో పీపీఏ వెలిబుచ్చే సందేహాలను క్లియర్ చేసిన తర్వాత ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. అది పూర్తయిన తరువాతే మేఘా కంపెనీ పనులు ప్రారంభించాలి. పోలవరం ప్రాజెక్టుకు అత్యంత భారీ మిషనరీ అవసరం ఉంటుంది.కాబట్టి వాటిని తెప్పించటానికి కొంత సమయం పట్టే అవకాశముంది. అయితే న్యాయపరంగా పోలవరం ప్రాజెక్టులో అడ్డంకులు తొలగినట్టుగా భావించొచ్చు. నవంబర్ లో పనులు ప్రారంభించి రెండేళ్లలో పనులు పూర్తి చేస్తామని ఏపీ ప్రభుత్వం చెబుతూ వస్తోంది.