English | Telugu
అమరావతిలో ఆధార్ లేకపోతే జైలుకే :- ఇతర ప్రాంతీయులకు రాజధానిలో ప్రవేశం లేదు
Updated : Dec 27, 2019
రాష్ట్ర మంత్రి మండలి సమావేశం నేపథ్యంలో రాజధాని అమరావతిలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. రాజధాని గ్రామాలపై అప్రకటిత కర్ఫ్యూని విధించారు. ఇప్పటికే యాంటీ నక్సల్స్ స్క్వాడ్ స్పెషల్ పార్టీ పోలీసులు రంగంలోకి దిగారు. ఇతర జిల్లాల నుంచి దాదాపు 2000 మంది పోలీసులు అమరావతిలో మకాం వేశారు. సచివాలయం వైపు వెళ్లే వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసి అనుమతిస్తున్నారు. ప్రతి వాహనం నెంబర్ నోట్ చేసుకుంటున్నారు.
అనుమానం ఉన్న వారిని ఆపి ఆధార్ కార్డ్ తనిఖీ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి రాజధానిలోకి ప్రవేశించే అన్ని రూట్లలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు. బయటి వ్యక్తులు ఒక్కరు కూడా రాజధాని లోకి అడుగు పెట్టకూడదని ఉన్నతాధికారుల నుంచి క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహిస్తున్న అధికారులు సిబ్బందికి ఆదేశాలు అందజేశారు. ఇప్పటికే ఇతర ప్రాంతాల వారికి రాజధాని గ్రామాల్లో ఆశ్రయం ఇవ్వొద్దని పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. ప్రభుత్వం మూడు రాజధానులపై ప్రకటన చేస్తే ఏఏ గ్రామాల్లో ఏ తరహా ఆందోళనలు తలెత్తే అవకాశం ఉందనే దానిపై నిఘా వర్గాలు పూర్తి సమాచారం సేకరించాయి.
దానికి అనుగుణంగా ఆయా గ్రామాలు ప్రాంతాలను ఎంచుకొని బందోబస్తును కట్టు దిట్టం చేస్తున్నారు. అన్ని ప్రధాన కూడళ్లు గ్రామాలకు వెళ్లే రోడ్డులో పెద్ద ఎత్తున బారికేడ్ లను.. ముళ్ల కంచెలను ఏర్పాటు చేశారు. అత్యవసర పరిస్థితులు ఎదురైతే టియర్ గ్యాస్ రబ్బరు బుల్లెట్లు వినియోగించాలని అవసరమైతే లాఠీచార్జి కూడా చేయాలని కూడా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. దీనిపై స్థానికులు పోలీసులను నిలదీస్తున్నారు. మేమేమైనా నక్సలైట్లమా, టెర్రరిస్టులమా అంటూ మండిపడుతున్నారు రాజధాని ప్రజలు. ఆధార్ కార్డులు దగ్గర పెట్టుకొని తిరగాలా అంటూ తిరగబడ్డారు. తాడిపల్లిలోని సీఎం నివాస పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. అనుమతి లేని వారిని ఎవరినీ కూడా పరిసర ప్రాంతాలలోకి రాకుండా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కొంత మంది రైతులు తమ నాయకులను కలిసి తమకు జరుగుతున్న అన్యాయాన్ని వివరించి కునేందుకు సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఉన్న పోలీసు సిబ్బంది వారిని కస్టడీ లోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.