English | Telugu

నల్లగొండ జిల్లాలోని స్థానిక ఎస్.బీ.ఐ లో చోరీ యత్నం...

నల్లగొండ జిల్లా కేంద్రంలో భారీ చోరీ జరిగింది, స్థానిక ఎస్.బీ.ఐ లోకి చొరబడ్డ దుండగులు భారీగా నగదు ఎత్తుకెళ్లారు. బ్యాంకు వెనక భాగానికి కన్నం వేసిన దొంగలు గ్రిల్స్ ని తొలగించి లోపలికి వెళ్లారు. నగదు ఉంచిన స్ట్రాంగ్ రూమ్ లోకి చొరబడి నగదును అపహరించారు. ఉదయం బ్యాంక్ ని తెరిచిన ఉద్యోగులు గ్రిల్స్ కట్ చేసి ఉండటం, లోపలి నగదు ఎత్తుకెళ్లిన ఆనవాళ్లు కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దొంగతనం జరిగిన తీరుపై దర్యాప్తు చేపట్టారు.

అయితే పోలీసు అధికారులు మరియు బ్యాంకు అధికారులు కలిసి ఇది ప్రొఫెషనల్ దొంగ కాదు కేవలం స్థానికంగా ఉండే దొంగ మాత్రమే ఇలా దొంగతనం చేసే ప్రయత్నం చేశాడు అనేటువంటి ఒక క్లారిటీకి వచ్చారు. అయితే బ్యాంక్ లో ఏటువంటి నగదు పోలేదని బ్యాంకు అధికారులు చెప్తున్నారు. ఈ దొంగతనానికి సంబంధించి పూర్తి స్థాయిలో పరిశీలిస్తే అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తుంది, ఎందుకంటే ఆ బ్యాంకుకు రాత్రి వాచ్ మేన్ కూడా లేడు. సాధారణంగా బ్యాంకుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఆలారం సిస్టం ఉంటుంది, ఈ బ్యాంకుకు అది కూడా లేదు.

గ్రిల్ ని తొలగించి లోపలికి వెళ్ళిన దొంగ అద్దాలను పగులగొట్టి గ్రిల్ కి ఉన్నటువంటి తాళాన్ని కూడా బయటకు విసిరేశాడు.సిసి టివి ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఎటువంటి మాస్క్ లేకుండా ఒక్క దొంగ మాత్రమే లోపలికి ప్రవేశించాడని చెప్తున్నారు. నల్గొండలో మెయిన్ బ్రాంచ్ గా ఉన్నటువంటి ఈ ఎస్.బి.ఐ లో దొంగతనం జరిగింది అనటంతో బ్యాంకు కష్టమర్లలో గుబులు పుట్టుకుంది. అయితే ఎటువంటి నగదు పోలేదని అధికారులు వెల్లడించిన తరువాత కష్టమర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆధారాలను సేకరించిన పోలీసులు దొంగను పట్టుకోవాటానికి దర్యాప్తు ముమ్మరం చేశారు.