హైదరాబాద్ గాంధీ హాస్పిటల్ దగ్గర జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. హాస్పిటల్ ఎదుట రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి హాస్పిటల్ లో ఓ రోగి చనిపోవడంతో రోగి బంధువులు డాక్టర్లపై దాడి చేశారు. ఆ దాడిని ఖండిస్తూ రాత్రి నుంచి జూడాలు ఆందోళన చేశారు. దీంతో హాస్పిటల్ లో ఎమర్జన్సీ సర్వీసులు తప్ప అన్ని సేవలు నిలిచిపోయాయి. సీఎం కేసీఆర్ గానీ, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గానీ వచ్చి తమకు హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదలమని డాక్టర్లు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఈటెల రాజేందర్ జూనియర్ డాక్టర్లతో చర్చలు జరపటానికి గాంధీ హాస్పిటల్ కు వచ్చారు. మొదట చర్చలు జరిపేందుకు జూనియర్ డాక్టర్లను సచివాలయంకు రావాలని కోరగా దానికి వారు నిరాకరించారు. దీంతో స్వయంగా మంత్రి గాంధీ హాస్పిటల్ కు వచ్చారు. గాంధీలో డాక్టర్ ల పై దాడి కొత్తేమి కాదని, కానీ కరోనా వైరస్ వచ్చిన తరువాత దాడులు మరింత పెరిగాయని, హాస్పిటల్ లో సెక్యూరిటీ కూడా తగ్గిందని వారు మంత్రికి మొరపెకున్నారు.
బేగంపేట్ కు చెందిన ఓ వ్యక్తి (55) కరోనా వైరస్ సోకడంతో మూడు రోజుల క్రితం గాంధీ హాస్పిటల్ లో చేరారు. శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన సీపీఏపీ మాస్క్‌ను తీసేసి వాష్‌రూమ్‌కు వెళ్లారని, అప్పుడు గుండె నొప్పి వచ్చి మంగళవారం రాత్రి 7.30కు అతడు చనిపోయినట్లు డాక్టర్లు చెబుతున్నారు. అయితే వైద్యుల నిర్లక్ష్యం వల్లే అతడు చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి బంధువులు వైద్య సిబ్బందిపై దాడి చేశారు. ఈ దాడిని ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. తమకి భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఈ నేపథ్యంలో మంత్రి ఈటెల వారితో సమావేశమయ్యారు. వారికి అండగా ఉంటామని మంత్రి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.