English | Telugu

తెలంగాణ మంత్రిగా కవిత..! అతిత్వరలోనే కేబినెట్లోకి..?

కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు త్వరలోనే డిప్యూటీ సీఎంగా ప్రమోషన్ లభించనుందంటూ ప్రచారం జరుగుతుండగా... ఇప్పుడు మరో ఆసక్తికరమైన వార్త టీఆర్ఎస్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. కేటీఆర్ సోదరి కవితను ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్లోకి తీసుకోబోతున్నారని అంటున్నారు. మొన్నటివరకు రాజ్యసభకు పంపుతారని ప్రచారం జరిగినా ఇప్పుడు ఆ ఊసే వినిపించడం లేదు. ఎందుకంటే, కవితకు అసలు రాజ్యసభకు వెళ్లాలన్న ఆసక్తి లేదని, రాష్ట్ర రాజకీయాల్లోనే చురుకైన పాత్ర పోషించాలని అనుకుంటున్నారట. అందుకే, తనకు రాజ్యసభ సభ్యత్వం వద్దంటూ కవిత తేల్చిచెప్పిందంటూ గులాబీ శ్రేణులు చెబుతున్నాయి.

పార్లమెంట్ ఎన్నికల ముందువరకు రాజకీయంగా ఫుల్ యాక్టివ్ గా ఉన్న కవిత... అనూహ్యంగా నిజామాబాద్ లో ఓడిపోవడంతో అప్పట్నుంచి కొంత సైలెన్స్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. కేసీఆర్ తనయురాలిగా, మంచి వాక్చాతుర్యమున్న వక్తగా, తనదైన శైలిలో... లోక్ సభలో గట్టిగా తెలంగాణ సమస్యలను వినిపిస్తూ పార్లమెంట్లో చురుకుగా వ్యవహరించిన కవిత... నిజామాబాద్లో ఓడిపోవడంతో కొంత మనస్తాపానికి గురయ్యారు. దాంతో, ఏడాదిగా యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే, కవితను మళ్లీ లైమ్ లైట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన ముఖ్యమంత్రి కేసీఆర్... రాజ్యసభకు పంపాలని భావించారు. కవిత కూడా అందుకు ఒప్పుకుందనే ప్రచారం జరిగింది. అయితే, ఇప్పుడు సడన్ గా కవిత మనసు మార్చుకున్నారట. రాజ్యసభకు కాకుండా రాష్ట్రంలోనే ఉంటూ చక్రం తిప్పాలని డిసైడయ్యారని కవిత సన్నిహితులు, అనుచరులు చెబుతున్నారు.

మొత్తానికి, అతి త్వరలోనే రాష్ట్ర రాజకీయాల్లో కవిత యాక్టివ్ కాబోతున్నారనే టాక్ గులాబీ వర్గాల్లో నడుస్తోంది. రాష్ట్ర మంత్రిగా పగ్గాలు చేపట్టనున్నారని చెబుతున్నారు. అయితే, ఎమ్మెల్సీగా కేబినెట్లోకి వస్తారా? లేక అనూహ్య పరిణామాలతో ఏదైనా అసెంబ్లీ సెగ్మెంట్ కి ఉపఎన్నిక వచ్చి ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర మంత్రివర్గంలోకి వస్తారో? త్వరలో క్లారిటీ వస్తుందని అంటున్నారు.