English | Telugu

నిప్పు లేనిదే పొగ రాదు... కియా రగడకు అసలు కారణమిదే?

దక్షిణ కొరియా దిగ్గజ కార్ల కంపెనీ కియా మోటార్స్ ...ఆంధ్రప్రదేశ్ నుంచి తరలిపోతోందంటూ ప్రముఖ వార్త సంస్థ రాయిటర్స్ ప్రచురించిన కథనం... ఏపీలో తీవ్ర కలకలం రేపుతోంది. రాయిటర్స్ కథనంతో జగన్ ప్రభుత్వం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. హుటాహుటిన మీడియా ముందుకొచ్చిన మంత్రి బుగ్గన.... కియా ఎక్కడికి తరలిపోవడం లేదంటూ క్లారిటీ ఇచ్చారు. టీడీపీ నేతలే పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కియా మోటార్స్ కావాల్సినవన్నీ ఇస్తున్నామని, తమ ప్రభుత్వం అందిస్తున్న సహకారంతో కియా యాజమాన్యం పూర్తి సంతృప్తితో ఉందన్నారు. అయితే, కియాతోపాటు ఏపీ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నవారిపై చర్యలు తీసుకోవాల్సిన సమయం వచ్చిందని బుగ్గన అన్నారు.

అయితే, ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద కార్ల కంపెనీగా పేరుగాంచిన కియా మోటార్స్... భారత్‌లోకి ఎంట్రీ ఇస్తూ తన తొలి ప్లాంట్‌ను ఏపీలో నెలకొల్పింది. పరిశ్రమ ఏర్పాటుకు అనంతపురం జిల్లాను ఎంచుకున్న కియా.... రెండేళ్ల నిర్మాణ పనుల తర్వాత... గతేడాది డిసెంబర్లో పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభించింది. దాదాపు 14వేల కోట్ల రూపాయల వ్యయంతో, ఏడాదికి 3లక్షల కార్ల ఉత్పత్తి సామర్ధ్యంతో నెలకొల్పిన అనంతపురం ప్లాంట్‌లో ప్రత్యక్షంగా 12వేల మందికి ఉద్యోగాలు కల్పించింది. అయితే, ప్రైవేట్ పరిశ్రమల్లో స్థానికులకు 75శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే కియాకు ఇబ్బందిగా మారిందనే ప్రచారం జరుగుతోంది. స్థానికంగా నిపుణులు లేకపోతే 75శాతం ఉద్యోగాలు ఎలా ఇవ్వగలమంటూ కియా అభ్యంతరం చెప్పిందని, ఇదే వివాదానికి కేంద్ర బిందువైందని అంటున్నారు.

అయితే, వైసీపీ ప్రభుత్వ విధానాలు, జగన్మోహన్ రెడ్డి తీరుపై ఆంధ్రప్రదేశ్ నుంచి పరిశ్రమలు తరలివెళ్లిపోతున్నాయని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కియా మోటార్స్ కూడా జగన్ ప్రభుత్వ తీరుతో విసిగిపోయే అలాంటి ఆలోచనకు వచ్చేరేమోనంటూ తెలుగుదేశం లీడర్లు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు, కియా వివాదంపై లోక్‌సభలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం జరిగింది. కియా మోటార్స్ ఏపీ నుంచి తరలిపోవాలనుకుంటోందని... కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు సభ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో, రామ్మోహన్ నాయుడు స్పీచ్‌కు అడ్డుతగిలిన వైసీపీ ఎంపీలు.... కియాపై తప్పుడు ప్రచారం చేయొద్దంటూ కౌంటరిచ్చారు. అయితే, వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.... రామ్మోహన్ నాయుడు సీటు దగ్గరకు వెళ్లడంతో సభలో కలకలం రేగింది. స్పీకర్ వారించడంతో మాధవ్ తిరిగి తన సీట దగ్గరికి వచ్చి కూర్చున్నారు.

టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు వ్యాఖ్యలను వైసీపీ లోక్‌సభాపక్ష నేత మిథున్‌రెడ్డి ఖండించారు. కియా పరిశ్రమ ఎక్కడికి తరలిపోవడం లేదని... తెలుగుదేశం నేతలు కావాలనే తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని మిథున్ రెడ్డి మండిపడ్డారు. ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్ రెడ్డి కూడా రాయిటర్స్ కథనంపై స్పందించారు. కియా తరలిపోతుందంటూ రాయిటర్స్ రాసిన కథనం పూర్తిగా అవాస్తవమన్నారు. కియా మోటార్స్ తరలిపోతోందన్న వార్తల్లో అస్సలు నిజం లేదన్నారు. కియా మోటార్స్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాయంటూ మంత్రి గౌతమ్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. అయితే, నిప్పు లేనిదే పొగరాదన్నట్లుగా స్థానికులకు 75శాతం ఉద్యోగాలివ్వాలన్న నిబంధనతోనే జగన్ ప్రభుత్వానికి, కియా యాజమాన్యానికి మధ్య రగడ మొదలైందని తెలుస్తోంది. అయితే, కియా తరలిపోనుందా? అంటూ కథనం రాసిన రాయిటర్స్ కూడా ఆషామాషీ సంస్థ కాదు. అందుకే, ఆగమేఘాల మీద రాయిటర్స్ కథనంపై మంత్రులు, వైసీపీ ఎంపీలు, ముఖ్యనేతలు స్పందించి నష్ట నివారణ చర్యలు చేపట్టారు.