English | Telugu

ఐటీ అధికారులను సైతం షాక్ కి గురి చేసిన కల్కి అక్రమాస్తులు...

కల్కి ఆశ్రమంలో అక్రమాస్తుల లెక్క తేల్చారు ఐటీ అధికారులు. మొదట్లో నాలుగు వందల తొమ్మిది కోట్ల రూపాయల లెక్కల్లో లేని ఆస్తులున్నట్లు భావించారు. కాని సోదాలు ముగిసేటప్పటికీ అది ఎనిమిది వందల కోట్లకు చేరింది. సోదాల్లో ఐటీ అధికారులు భారీగా నగదు, బంగారం, విదేశీ కరెన్సీతో పాటు పలు డాక్యుమెంట్ లను స్వాధీనం చేసుకున్నారు. గత ఐదు రోజులుగా కల్కికి చెందిన నలభై ప్రాంతాల్లో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మొత్తం మూడు వందల మంది అధికారులు ఈ సోదాల్లో పాల్గొన్నారు.

తనకు తాను దేవుడిగా చెప్పుకునే కల్కి భగవాన్ వెనకేసుకున్న ఆస్తుల గుట్టును విప్పింది ఆదాయపన్నుశాఖ. ఆయన ఆస్తులు నోట్ల కట్టలు చూసి ఐటీ అధికారులే షాక్ కు గురయ్యారు అంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మూడొందల మంది అధికారులు చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం లోని కల్కి ఆశ్రమంతో పాటు నలభై ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరుతో పాటు చిత్తూరులోనూ ఐటీ అధికారులు సోదాలు చేశారు. ఆశ్రమం నుంచి ఎవర్నీ బయటకు పంపించకుండా సోదాలు నిర్వహించారు. ఐదు రోజుల పాటు సాగిన సోదాల్లో పలు సంచలనాలు బయటకు వచ్చాయి. భారీగా నోట్ల కట్టలు బయట పడ్డాయి. బాక్సుల్లో కేజీల కొద్ది బంగారం ధగధగా మెరిసే వజ్రాలను ఐటీ అధికారులు గుర్తించారు. నలభై నాలుగు కోట్ల నగదుతో పాటు ఇరవై కోట్ల రూపాయల విలువైన విదేశీ కరెన్సీని గుర్తించాయి ఐటీ బృందాలు.వీటితో పాటు తొంభై కేజీల బంగారం బాక్సులను కూడా గుర్తించారు. ఈ దాడుల్లో స్వాధీనం చేసుకున్న వజ్రాల విలువ ఐదు కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.

వరదయ్యపాళెం ఆశ్రమంతో పాటు కల్కీకి చెందిన వైట్ లోటెస్ ఇతర ప్రాంతాల్లో సోదాలు ముగిశాయి. ఈ సోదాల్లో దాదాపు ఎనిమిది వందల కోట్లకు పైగా లెక్కల్లోకి రాని ఆస్తులు గుర్తించారు. దాదాపు ఎనభై ఐదు కోట్ల డబ్బును హవాలా ద్వారా సేకరించినట్టు చెబుతున్నారు. తాను దేవుడి రూపమంటూ చెప్పే విజయ్ కుమార్ అలియాస్ కల్కి భగవాన్ పెద్ద మొత్తంలో నగదును నిల్వ చేయటం అధికారులను సైతం విస్మయపరిచింది. ఐటీ శాఖ ట్యాక్స్ మినహాయింపులను కల్కి భగవాన్ ఆశ్రమం దుర్వినియోగం చేస్తోందంటూ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఆశ్రమానికి వచ్చిన సొమ్మును అక్రమంగా పెట్టుబడుల పెడుతున్నారన్న ఆరోపణలతో ఐటి శాఖ రంగంలోకి దిగింది. ఆశ్రమం నిర్వహణ పేరుతో భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన కల్కి భగవాన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆ నిధులను వ్యాపారాల్లో పెట్టుబడుల మీదగా మళ్ళించినట్లు చెబుతున్నారు. అంతేకాదు కల్కి కొడుకు కృష్ణ విదేశాల్లో భారీగా పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. అమెరికాతో పాటు చైనా, సింగపూర్, యూఏఈలలో కల్కి కుమారుడికి కంపెనీలు ఉన్నట్టు చెబుతున్నారు. ఐటీ శాఖ దాడులు జరిగినప్పటి నుంచి కల్కి భగవాన్ ఆయన సతీమణి కనిపించటం లేదు. ఇప్పటికే కల్కి కుమారుడు కృష్ణ అతని భార్యను ఐటీ శాఖ అధికారులు విచారించారు. గత రెండేళ్లుగా కల్కి భగవాన్ అతని భార్య ఆశ్రమానికి రావడం లేదని అక్కడి సిబ్బంది చెబుతున్నారు.