English | Telugu

నయ్‌కూ హతం! భద్రతా దళాల అతి పెద్ద విజయం!

హిజ్బుల్‌ ముజాహిదీన్‌ ఉగ్రవాద సంస్థలో టాప్‌ కమాండర్‌, కరడుగట్టిన ఉగ్రవాది రియాజ్‌ నయ్‌కూను భద్రతా బలగాలు అతడి సొంత గ్రామంలోనే హతమార్చాయి. సొంతూరులో అమ్మను కలిసేందుకు బేగ్‌పొరాకు వస్తున్నట్లు ఈ నెల 5న సమాచారం అందగానే సైన్యం అప్రమత్తమైంది. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో ఒకటిన్నర కిలోమీటర్‌ వరకూ గ్రామాన్ని చుట్టుముట్టారు. ఉదయం 9 గంటలకు రియాజ్ దాక్కున్న ఇంటిని గుర్తించి పేల్చివేశారు. అయితే అక్కడ నుంచి తృటిలో తప్పించుకున్న రియాజ్ మరో ఇంట్లోకి దూరాడు. ఆ ఇంట్లో అప్పటికే ఉన్న సైన్యం రియాజ్‌ను హతమార్చింది. జమ్మూకశ్మీర్‌ పోలీసులు, ఆర్మీ 55 రాష్ట్రీయ రైఫిల్స్‌, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్తంగా సంయుక్తంగా జరిపిన ఆపరేషన్ విజ‌య‌వంతం అయింది.

గణిత ఉపాధ్యాయుడిగా పనిచేసే 35 ఏళ్ల రియాజ్‌ 2012లో హిజ్బుల్‌ ముజాహిదీన్‌లో చేరాడు. కరడుగట్టిన ఉగ్రవాది హిజ్బుల్‌ కమాండర్‌ బుర్హాన్‌ వనీ హతమైన తర్వాత ఆ బాధ్యతల్ని రియాజ్‌ చేపట్టాడు. మరో కీలక ముష్కరుడు జాకీర్‌ ముసా ఈ సంస్థ నుంచి వేరైన తర్వాత రియాజే కీలక వ్యక్తిగా మారాడు. కశ్మీర్‌లోయలో యువకుల్ని ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో ప్రధాన పాత్ర పోషించేవాడు.

రియాజ్‌ నయ్‌కూ 2016 జనవరిలో వెలుగులోకి వచ్చాడు. అప్పట్లో ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన షారిక్‌ అహ్మద్‌ భట్‌ అంత్యక్రియల సమయంలో రైఫిల్స్‌తో గాల్లోకి కాల్పులు జరుపుతూ ముందుకునడుస్తూ కనిపించాడు.

అవంతిపుర జిల్లాకు చెందిన ఇతడు భద్రతా సిబ్బంది, పోలీసు అధికారుల్ని చంపిన ఎన్నో ఘటనల్లో ప్రధాన నిందితుడు. ఏ ++ కేటగిరీకి చెందిన ఉగ్రవాదిగా ముద్రవేసుకున్నాడు. అతడి తలపై రూ.12లక్షల రివార్డు కూడా ఉంది. కశ్మీర్‌లో హిజ్బుల్‌ ఉగ్రకార్యకలాపాల్లో నయ్‌కూదే కీలక పాత్ర.

ఈ ముష్కరుడిని పట్టుకొనేందుకు 2018-19లో భద్రతా దళాలు చాలా తీవ్రంగా కష్టపడ్డాయి. కానీ, అతడు దాక్కోవడం.. పోలీసులు వెతకడం కొనసాగుతూ వచ్చింది. 2018లో ఓ ఉన్నతాధికారి ఎదుట లొంగిపోతానని చెప్పి ఆయననూ బోల్తా కొట్టించాడు. ఈ ఏడాది డజన్‌ మంది యువకుల్ని ఈ ఉగ్రవాద సంస్థలోకి చేరేలా ఆకర్షితుల్ని చేశాడు.

'నయ్‌కూను మనం అంతమొందిస్తే దక్షిణ కశ్మీర్‌లో హిజ్బుల్‌ దాదాపు తుడిచిపెట్టుకుపోయినట్టే' అని గతంలో కశ్మీర్‌ ఐజీ విజయ్‌కుమార్‌ అన్న మాటల్ని బట్టి చూస్తే హిజ్బుల్‌లో అతడు ఎంత కీలకమైనవాడో, మరెంతో ప్రమాదికారో అర్థం చేసుకోవచ్చు.

హంద్వారా ఎన్‌కౌంటర్ జరిగిన 3 రోజుల్లోనే సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. హంద్వారా ఎన్‌కౌంటర్‌లో కల్నల్ అశుతోష్ శర్మ, మేజర్ అనుజ్ సూద్ తదితరులు అమరులయ్యారు. దీనిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. హంద్వారా ఘటన జరిగిన 3 రోజుల్లోనే సైన్యం రియాజ్ సహా నలుగురిని హతమార్చింది.