English | Telugu

ఉత్కంఠంగా మారిన మూడు రాష్ట్రాల కౌంటింగ్

ఎన్నికల కౌంటింగ్ మొదలైన సందర్భంగా అందరిలో ఉత్కంఠత వాతావరణం నెలకొంది.హర్యానాలో మొత్తం తొంభై శాసన సభ స్థానాలకు గాను ఒక వెయ్యి నూట అరవై తొమ్మిది మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. హర్యానాలో కాశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు, జాతీయ భద్రత వంటి అంశాలపైనే ఎన్నికల ప్రచారంలో బిజెపి అధికంగా దృష్టి పెడితే, కాంగ్రెస్ రైతు సమస్యలు, నిరుద్యోగం, శాంతి భద్రతల అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ హోరాహోరీగా పోటీ ఇచ్చింది. రెండు వేల పద్నాలుగు ఎన్నికలతో పోల్చి చూస్తే హర్యానాలో పోలింగ్ డెబ్బై ఆరు పాయింట్ ఐదు నాలుగు నుంచి అరవై ఎనిమిది శాతానికి భారీగా పడిపోవడంతో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. దేవిలాల్ స్థాపించిన ఇండియన్ నేషనల్ లోక్ దళ్ పార్టీ చీలిక వర్గం దుష్యంత్ చౌతాలా నేతృత్వంలో ఏర్పడిన జననాయక్ జనతా పార్టీ కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి.

ఇక మహారాష్ట్ర శాసన సభలో రెండు వందల ఎనభై ఎనిమిది స్థానాలకు జరిగిన ఎన్నికల్లో మూడు వేల రెండు వందల ముప్పై ఏడు మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. బిజెపి నూట అరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తే మిత్ర పక్షం శివసేన నూట ఇరవై నాలుగు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఇక ప్రతిపక్ష కాంగ్రెస్ నూట నలభై ఏడు స్థానాల్లో ఎన్సీపీ నూట ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేశాయి. ఈ రెండు కూటముల మధ్య ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ ప్రధానమంత్రి మోదీ, బిజెపి అధ్యక్షుడు అమిత్ షా ద్వయం రాజకీయ వ్యూహాల ముందు విపక్షాలు నిలబడలేవని ఇంచుమించుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ అంచనా వేస్తున్నాయి.వాళ్ళ వ్యూహాలు నిజమైతాయో లేదో వేచి చూడాలి.