English | Telugu

న్యూ ఇయర్ ఎఫెక్ట్..  డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే పదివేలు ఫైన్, వాహనం సీజ్!!

డిసెంబర్ 31 రాత్రి వచ్చిందంటే చాలు ఎక్కడలేని ఉత్సాహం తన్నుకొస్తుంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు భారీగా ఏర్పాట్లు చేసుకుంటారు. కొందరైతే పీకల దాకా తాగి రోడ్ల మీదకు వచ్చి రచ్చ రచ్చ చేస్తుంటారు. అరుపులు కేకలతో హోరెత్తించి పిచ్చిపట్టినట్టు వ్యవహరిస్తుంటారు. మరికొందరైతే రోడ్ల మీద రైడింగ్ పోటీలు పెట్టుకొని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇలాంటి చిల్లర మల్లర వేషాలను కట్టడి చేసేందుకు పోలీసులు కూడా ఈ సారి పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. తాగే తందానా బ్యాచ్ కు చుక్కలు చూపించేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు.

డ్రంకెన్ డ్రైవ్ లో దొరికితే 10,000 ల జరిమానాతో పాటు వాహనం సీజ్ తప్పదని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ఇందు కోసం స్పెషల్ టీంలను ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా, న్యూయిర్ వేడుకల్లో ప్రమాదాలతో పాటు న్యూసెన్స్ చోటు చేసుకోకుండా హోటళ్లు, పబ్బులకు గైడ్ లైన్స్ జారీ చేశారు పోలీసులు. రాత్రి ఎనిమిది నుంచి అర్ధరాత్రి ఒంటి గంట వరకు మాత్రమే వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. 45 డెసిబుల్స్ మ్యూజిక్ సిస్టం కంటే పెద్దవి వాడొద్దని హెచ్చరించారు. డ్రంకెన్ డ్రైవ్ పేరుతో మందు బాబుల భరతం పట్టనున్నారు పోలీసు అధికారులు. మొత్తం మీద మందు బాబులకు గట్టి మోత పడునుంది.