English | Telugu
అమ్మో జగన్ సర్కార్ ని ప్రశ్నించడమా.. ఇంకేమన్నా ఉందా!!
Updated : May 25, 2020
ఇటీవల ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనలో 12 మంది మరణించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అనుమానాలు ఉన్నాయంటూ ఓ వ్యక్తి చేసిన ఫేస్ బుక్ పోస్ట్ ని.. గుంటూరు కి చెందిన 66 ఏళ్ళ రంగనాయకమ్మ షేర్ చేశారు. దీంతో ఆమెకి సీఐడీ అధికారులు నోటీసులిచ్చి, విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
తాజాగా రాజమహేంద్రవరంకి చెందిన అనూష ఉండవల్లికి కూడా నోటీసులను అందజేశారు. అధికార పార్టీకి, అధికార పార్టీ నేతలకు వ్యతిరేకంగా పోస్ట్ లు పెట్టినందుకే ఆమెకు నోటీసులు అందాయి. దీంతో నెటిజనులు ఏపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ పెట్టాలంటేనే భయపడిపోతున్నారు. మరోవైపు, ప్రతిపక్ష టీడీపీ.. జగన్ సర్కార్ ప్రజల స్వేచ్చని హరిస్తోందని, కక్ష సాధింపులకు దిగుతోందని విమర్శిస్తోంది.
ఇక టీడీపీ నారా లోకేష్ అయితే.. మరి సోషల్ మీడియాలో మీ అంతుచూస్తాం, చంపుతాం అని బెదిరిస్తున్న వారి మీద చర్యలు తీసుకోరా? అని ప్రశ్నిస్తున్నారు. జగన్ సర్కార్ కి వ్యతిరేకంగా మాట్లాడితే మీ అంతుచూస్తాం అంటూ కొందరు దుర్భాషలాడుతూ బెదిరిస్తున్న వీడియోని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన లోకేష్.. మరి వీరిపై చర్యలు తీసుకోరా? అని జగన్ సర్కార్ ని ప్రశ్నించారు.
కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టినందుకు నోటీసులు, విచారణ, అరెస్టులు అంటున్నారు. మరి అదే సోషల్ మీడియాలో ఎందరో అసభ్యకరంగా పోస్ట్ లు పెడుతున్నారు.. మరి వారిపైన ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, వారి కుటుంబసభ్యుల గురించి కొందరు అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మహిళల గురించి దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. కొందరు కొన్ని కులాలను టార్గెట్ చేస్తూ, కుల విభేదాలు రెచ్చగొడుతున్నారు. మరికొందరు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అలాంటి వారిని వదిలేసి కేవలం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్ట్ లు పెడుతున్నవారిపై మాత్రమే చర్యలు తీసుకోవడం ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.