English | Telugu
ఇదెక్కడి చోద్యం.. ముగ్గులు వేసిన మహిళలు అరెస్ట్!!
Updated : Dec 30, 2019
పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా చెన్నైలో వినూత్నమైన నిరసన తెలిపారు. కొందరు మహిళలు బీసెంట్ నగర్ లోని 17వ క్రాస్ స్ట్రీట్ లో ఇళ్ల ముందు ముగ్గురు ముగ్గులు వేసి నో సీఏఏ నో ఎన్ఆర్సీ అంటూ రాశారు. చాలా ఇళ్ల ముందు ఇలా కనిపించడంతో విషయం తెలుసుకొని ఆ ప్రాంతానికి చేరుకున్నారు పోలీసులు. ఈ నిరసనకు కారణమైన వారిని గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా అందుకు కొందరు ప్రతిఘటించారు. పోలీసులతో వాగ్వాదానికి కూడా దిగారు. ప్రజాస్వామ్య పద్ధతితో నిరసన తెలియజేస్తుంటే ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. చివరకు నిరసనకారులను బలవంతంగా వ్యాన్ లో ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు అధికారులు.ఈ ఘటనలో నలుగురు మహిళలతో సహా ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల తీరును డిఎంకె చీఫ్ స్టాలిన్ తప్పుబట్టారు. సీఏఏను వ్యతిరేకిస్తూ ముగ్గులు వేస్తే కేసులు పెడతారా అని ఫేస్ బుక్ వేదికగా ఆయన మండిపడ్డారు. ఈ ముగ్గుల నిరసన డీఎంకే చీఫ్ స్టాలిన్ ఆ పార్టీ నేత కనిమొళి ఇళ్లకు కూడా పాకింది. నిరసనకారులు వారి వారి ఇళ్ల ముందు కూడా సీఐఏ,ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా ముగ్గులు వేశారు. మాజీ సీఎం కరుణా నిధి ఇంటి ముందు సైతం ఇదే తరహాలో నిరసనలకు కూడా దిగారు.