English | Telugu

తమిళనాడు నుంచి వచ్చిన కనగరాజ్ కు క్వారంటైన్ వర్తించదా: సిపిఐ రామకృష్ణ 

సి పి ఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై కన్నెర్ర చేశారు. నూతన ఎన్నికల కమిషనర్ జస్టిస్ కనగరాజ్ క్వారంటైన్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు, 75 ఏళ్ల వయస్సున్న జస్టిస్ కనగరాజ్ ను కరోనా ఏమీ చేయలేదా? ఆయనకు లాక్ డౌన్ నిబంధనలు వర్తించవా, అంటూ రామకృష్ణ, సి.ఎం. ను ప్రశ్నించారు.

"కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసే లక్ష్యంతో గత ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయగా వైసిపి రాద్దాంతం చేసింది. ఆయన్ను తొలగించే వరకు ముఖ్యమంత్రి జగన్ నిద్రపోలేదు.కరోనా పాజిటివ్ కేసులలో దేశంలో 2వ స్థానంలో తమిళనాడు ఉంది. తమిళనాడు నుండి ఏపీ ఎన్నికల కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించడానికి జస్టిస్ కనకరాజ్ విజయవాడ ఎలా చేరుకో గలిగారు," అని కూడా రామకృష్ణ ప్రశ్నించారు. ఇది "లాక్ డౌన్" నిబంధనల ఉల్లంఘన కాదా, అని ఆయన నిలదీశారు. హైదరాబాద్ నుండి వచ్చే వాళ్ళు ఖచ్చితంగా క్వారంటైన్ లో ఉండాలని చెబుతున్న వైసీపీ నేతలు, జస్టిస్ కనగరాజ్ ను 14 రోజులు క్వారంటైన్ లో ఉంచకుండా ఎలా తిరగనిస్తున్నారని కూడా సి పి ఐ నేత అనుమానం వ్యక్తం చేశారు.