English | Telugu

జంబో జెట్ కు గుడ్ బై చెప్పిన బ్రిటీష్ ఎయిర్ వేస్

క్వీన్ ఆఫ్ స్కైస్ గా పిలువబడే బోయింగ్ 747 విమానాలను ఇక నడపబోమని బ్రిటిష్ ఎయిర్ వేస్ ప్రకటించింది. జంబో జెట్ గా పిలువబడే ఈ అతిపెద్ద విమానం గత అర్థ శతాబ్దంగా లక్షలాది మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు చేర్చింది. అయితే కరోనా కారణంగా ప్రస్తుతం నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో విదేశీప్రయాణాలు చేసే వారి సంఖ్య బాగా తగ్గిపోయింది. దాంతో విమానయాన రంగం నష్టాల్లో పడింది. దాంతో చాలా సంస్థలు నష్టాలను తగ్గించుకోవడానికి మార్గాలను వెతుకుతున్నాయి. తాజాగా బ్రిటిష్ ఎయిర్వేస్ బోయింగ్ 747 నడపడం వల్ల నష్టాలు వస్తున్నాయని తెలిపింది. నిజానికి 2024లో బోయింగ్ 747 విమానాలను ఆపేయాలని బ్రిటిష్ ఎయిర్ వేస్ గతంలోనే నిర్ణయం తీసుకుంది. అయితే ప్రసుత్తం నెలకొన్న పరిస్థితులతో నాలుగేండ్లు ముందుగానే జంబో విమానసర్వీసులను ఆపేసింది.

50ఏండ్లుగా..
జెంటో జెట్, డబుల్ డెక్కర్, క్వీన్ ఆఫ్ స్కైస్ తదితర పేర్లతో పిలువబడే బోయింగ్ 747 విమానం ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చి 50ఏండ్లు పూర్తి చేసుకుంది. భారీ ఆకారంతో సులభంగా గుర్తించేలా ఉండే ఈ విమానాన్నిమొదటిసారిగా సెప్టెంబర్ 30 1968 నాడు జరిగిన రూల్ అవుట్ సెలబ్రేషన్స్ లో బోయింగ్ సంస్థ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ తర్వాత 1969లో మొదటిసారి ఆకాశంలో విహరించింది. పరీక్షలన్నీ పూర్తి చేసుకుని 1970 నుంచి ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చింది. 1971లో మొదటిసారి లండన్-న్యూయార్క్ మధ్య ఆకాశయానం చేసింది. నాలుగు ఇంజన్స్ తో నడిచే ఈ విమానం అత్యంత వేగంగా ప్రయాణిస్తుంది.