English | Telugu

పాకిస్తాన్ రైలులో ఘోర ప్రమాదం, 60 మందికి పైగా మృతి

పాకిస్తాన్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రైలు బోగీలు మంటల్లో చిక్కుకొని అరవై మందికి పైగా ప్రయాణికులు మృతి చెందారు. ఘటన తీవ్రతను బట్టి మృతుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. లాహోర్ నుంచి కరాచి వెళ్తున్న తేజ్ గామ్ ఎక్స్ ప్రెస్ లో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. రహిమ్యార్ ఖాన్ సమీపం లోని లియాఖత్ పూర్ వద్దకు రాగానే మూడు బోగీలు మంటల్లో చిక్కుకున్నాయి. ఉదయం టిఫిన్ తయారీ కోసం ఏర్పాట్లు చేస్తున్న సమయంలో రెండు స్టవ్ లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి.

వంట కోసం సిద్ధంగా ఉంచుకున్న నూనెకు మంటలంటుకోవడంతో పరిస్థితి బీభత్సంగా మారిపోయింది. క్షణాల్లో మంటలు మూడు బోగీలను చుట్టుముట్టాయి. భయపడిపోయిన ప్రయాణికులు వేగంగా వెళుతున్న ట్రైన్ నుంచి బయటకు దూకేశారు. చనిపోయిన వారిలో అలా బయటికి దూకేసిన వారే ఎక్కువగా ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు, ఘటనలో కనీసం యాభై మంది దాకా తీవ్రంగా గాయ పడ్డారు.

పాకిస్థాన్ లో రైలు ప్రమాదాలు సంభవించడం సర్వ సాధారణమైపోయింది, ఎప్పుడో బ్రిటిష్ పాలన కాలం నాటి రైలు వ్యవస్థ ఇప్పటికీ కొనసాగుతోంది. నిర్వహణ అస్తవ్యస్తం కారణంగా జరిగిన అనేక ప్రమాదాల్లో చాలా మంది ప్రయాణికులు చనిపోయారు. 2005 లో రెండు రైళ్లు ఎదురెదురుగా ఢీకొనడంతో నూట ముప్పై మందికి పైగా ప్రయాణికులు చనిపోయారు. పాకిస్థాన్ రైళ్లలో ప్రయాణికులు వంట చేసుకోవడానికి అనుమతి ఉంటుంది, అదే ఇప్పుడు ప్రయాణికులకు శాపంగా మారింది. వంట చేస్తున్న క్రమంలో మంటలు అంటుకుని పలువురి ప్రాణాలు తీసింది.