English | Telugu

రాజధాని రగడ మరింత ముదరనుందా?

కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకొన్న మరుసటి రోజే సీఎం విశాఖ పర్యటనకు వెళ్తున్నారు. అక్కడ ప్రతిపాదిత రాజధాని ప్రాంత పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారు. శాసన సభ శీతాకాల సమావేశాల్లో 3 రాజధానుల మాట సీఎం జగన్ నోటి నుంచి వెలువడినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని గురించే చర్చ జరుగుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలు ఆయన పర్యటనను ఆచితూచి స్వాగతిస్తున్నాయి. రాయలసీమ జిల్లాలు కర్నూలులో హై కోర్టు ప్రకటనపై తొలుత సానుకూలంగా స్పందించాయి. అయితే రాష్ట్రంలో 3 రాజధానులు ఉండే అవకాశమే లేదని పరిపాలన విశాఖ నుంచే జరుగుతుందని సీఎం మంత్రుల వ్యాఖ్యలను బట్టి తేలిపోయింది. దీంతో అమరావతి నగరంతో పాటు రాయలసీమ ప్రాంతంలోనూ ఆందోళనలు మొదలయ్యాయి.

రాజధాని నగరంగా ప్రకటించనున్న విశాఖలో ఉత్తరాంధ్ర జిల్లాలలో ఒక్కసారిగా భూముల ధరలు ఆకాశాన్ని తాకడం భూ కబ్జాల పర్వానికి పెద్ద ఎత్తున తెరలేపడంతో ఈ ప్రాంత వాసుల్లో భయం ఆవహిస్తుంది. ఇప్పటికే విశాఖలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చుక్కలనంటింది. రాజధాని ప్రకటనతో ఇప్పుడు ఒక్కసారిగా సామాన్యుడికి నిలువ నీడ దక్కనంత ఎత్తుకు ఎగబాకింది. ఈ 6,7 నెలల్లో4000 ఎకరాలకు పైగా కబ్జా చేసినట్టు వస్తున్న వార్తలు ప్రజలను మరింత కలవరపరుస్తున్నాయి. అమరావతినే రాజధానిగా కొనసాగించాలన్న ఏకాభిప్రాయానికి ఇపుడిపుడే రాజకీయ పక్షాలన్నీ వస్తున్నాయి. శాసన సభలో సీఎం జగన్ ప్రకటన చేసినప్పుడు కాస్త గందరగోళంలో పడ్డ పార్టీలు తొలుత అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతించాయి. కానీ అది పాలన వికేంద్రీకరణ అని అర్థం కావటంతో అమరావతినే కొనసాగించాలని పట్టుబడుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అమరావతిని రాజధానిగా కొనసాగించాలన్నదే తమ నిర్ణయమని ఇప్పటికే ప్రకటించింది. అమరావతి వల్ల ఏ ఇబ్బందులూ, ప్రతిబంధకాలు, సమస్యలు ఉన్నాయో ప్రజలకూ వివరించకుండా ఏక పక్షంగా తరలింపు నిర్ణయం తీసుకోవడం ఏంటని నిలదీస్తుంది. తన నిర్ణయానికి అందరూ శిరసావహించాలన్న ధోరణిలో ముఖ్యమంత్రి ఉన్నారని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఆక్షేపిస్తున్నారు. తన సార్వభౌమాధికారాన్ని గురించి ఆలోచిస్తున్న జగన్ ప్రజాస్వామ్యంలో దేశ సార్వభౌమాధికారాన్ని రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను పరిగణన లోకి తీసుకోవటం లేదని అంటున్నారు.

అమరావతి నగరం నుంచి పరిపాలనను తరలించటాన్ని టిడిపి తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తోంది. రైతులు రాజధాని ప్రాంత వాసుల ఆందోళనకు ప్రత్యక్షంగా మద్దతిస్తోంది. జనసేన వామపక్షాలు కూడా వారికి దన్నుగా నిలుస్తున్నాయి. అమరావతి నుంచి సచివాలయాన్ని తరలిస్తామని ప్రభుత్వం ప్రకటించిన నాటి నుంచి ఈ ప్రాంత రైతులు ఆందోళనకు దిగారు. వారం రోజులుగా రాజధాని నగర ప్రాంత పరిధిలో 29 గ్రామాల ప్రజలు ధర్నాలు రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. వాటిని అణచివేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక బలగాలను రంగంలోకి దించింది. సచివాలయం హై కోర్టుకు వెళ్లే దారిలో భద్రతను పెంచారు. ఉద్రిక్త నేపథ్యం లోనే క్యాబినెట్ సమావేశం జరగనుంది. రాజధాని రైతుల నిరసనలు ఉధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం వారి మధ్య చీలిక తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. పెద్ద రైతు పేద రైతు అనే విభజన తెచ్చేందుకు యత్నిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పెద్ద రైతులకు ఒక నిబంధన, చిన్న రైతుల మరో నియమావళిని అమలు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుందని అంటున్నారు. రాజధాని మార్పుపై సీఎం జగన్ అసెంబ్లీలో ప్రకటన చేశాక చకచకా నిర్ణయాలు అమలు జరుగుతున్నాయి. విశాఖను రాజధానిగా ప్రకటించినందున ఈ నెల 28 న అక్కడకు రానున్న సీఎం జగన్ కు ఘన స్వాగతం పలకబోతున్నామని వైసిపి జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటించారు.ఈ నేపథ్యంలో రాజధాని మార్పును అడ్డుకునే శక్తి కేంద్రానికి ప్రధానంగా ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్ షా లకు మాత్రమే వుందన్న అభిప్రాయం రాష్ట్ర ప్రజల్లో ఉంది. నేటి భేటి తరువాత ఏం జరగబోతోంది తదుపరి ఏ నిర్ణయం తీసుకోనున్నారు అనే అంశంతో అందరిలో ఉత్కంఠ నెలకొంది.