English | Telugu
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసిన అమరావతి రైతులు
Updated : Feb 7, 2020
అమరావతి రైతులు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. రాజధాని తరలింపును అడ్డుకోవాలి అని కోరుతూ వినతి పత్రం సమర్పించారు. అమరావతి నుంచి రాజధాని తరలిస్తే తమకు ఎదురయ్యే ఇబ్బందుల్ని రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు. రాజధాని వికేంద్రీకరణను అడ్డుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అమరావతి జేఏసీ నేతలు ఢిల్లీ వేదికగా తమ వాణి వినిపిస్తున్నారు. జెఎసి ప్రతినిధులు మధ్యాహ్నం నితిన్ గడ్కరీతో పాటు పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసే అవకాశం ఉంది. అమరావతి రాజధాని పరిరక్షణ సమితి ప్రతినిధి బృందం మరియు పలు రాజధాని రైతుల ఢిల్లీ పర్యటన ఏడవరోజు కొనసాగుతుంది. రాజధాని రైతులతో పాటు టీడీపీ ఎంపిలు కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిశారు. యాభై రోజులుగా రాజధాని గురించి అమరావతిలో జరుగుతున్న ఆందోళన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పరిస్థితులు ఏపీ ప్రభుత్వ నిర్ణయాలన్నిటినీ కూడా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దృష్టికి అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు, రైతులు తీసుకెళ్ళారు.
మధ్యాహ్నం పార్లమెంట్ లో నితిన్ గడ్కరితో కూడా భేటీ కాబోతున్నారు. అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ, హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలుసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. ఈ నెల పదకొండు (ఫిబ్రవరి 11) వరకు పార్లమెంట్ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంట్ సమావేశాలు ముగిసేవరకు ఇక్కడే ఉండి ప్రధానమంత్రి నరేంద్రమోడిని, అమిత్ షాను కలిసి విజ్ఞాపన పత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కేంద్రం రాజధాని విషయంలో రాష్ట్రాల పరిధిలో ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేసినప్పుడు కూడా అమరావతి పరిరక్షణ సమితి ప్రతినిధులు, పలు రైతులు మాత్రం పూర్తిస్థాయిలో కేంద్రం జోక్యం చేసుకుంటుందన్న విశ్వాసంతో వారున్నారు. ఆ నేపథ్యంలోనే ఒక్కొక్కరిని కలిసి వినతి పత్రం ఇస్తున్నారు. ఎట్టి పరిస్థితిలో జోక్యం చేసుకోకపోతే నష్టం జరుగుతుందన్న వాదనను కూడా ప్రధానంగా వారంతా వినిపిస్తున్నారు.