English | Telugu

ఒబామా, మోడీ తర్వాత రజనీ వర్సెస్ అక్షయ్

డిస్కవరీ ఛానెల్‌లో ప్రసారమయ్యే మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌‌కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ ఉంది. 180కి పైగా దేశాల్లో డిస్కవరీ నెట్‌వర్క్‌పై ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ అడ్వంచర్ ప్రోగ్రామ్ ప్రసారమవుతుంది. అడవుల్లో తిరుగుతూ... ఎడారులు, నదుల్లో ప్రయాణిస్తూ... కొండలు ఎక్కుతూ... చిత్రీకరించే ఈ అడ్వెంచర్ డాక్యుమెంటరీకి వరల్డ్‌ వైడ్‌ అభిమానులున్నారు. అందుకే, ప్రపంచవ్యాప్తంగా పరిచయమున్న వివిధ రంగాల ప్రముఖులతో ఈ మ్యాన్ వర్సెస్ వైల్డ్‌‌ను చిత్రీకరిస్తూ ఉంటారు. దాంతో, ఈ షోకి విపరీతమైన ఆదరణతోపాటు అదరిపోయే రేటింగ్ కూడా వస్తుంటుంది. అందుకే, ఈ షోలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒమామా కూడా పాల్గొని బేర్ గ్రిల్స్‌తో కలిసి సాహసాలు చేశారు.

అయితే, ఈ సెన్సేషనల్ షోను ఇండియాలో చేయాలని ప్లాన్ చేసినప్పుడు మొట్టమొదటి ఎపిసోడ్‌కు భారత ప్రధాని నరేంద్రమోడీని బేర్ గ్రిల్స్ ఎంచుకున్నారు. ఉత్తరాఖండ్ జిమ్ కార్బెట్ అడవుల్లో చిత్రీకరించిన ఈ సాహస యాత్రను డిస్కవరీ ఛానల్ మనోహరంగా చూపించింది. గతేడాది ప్రసారం చేసిన మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌లో భారత ప్రధాని నరేంద్రమోడీ తన సాహసాలతో ఆకట్టుకున్నారు. ఉత్తరాఖండ్‌ జిమ్‌ కార్బెట్‌ అడవుల్లో మోడీతో మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌ను షూట్ చేశారు బేర్ గ్రిల్స్‌. అత్యంత భయానకంగా ఉండే జిమ్ కార్బెట్ అడవుల్లో బేర్ గ్రిల్స్‌‌తో కలిసి కలియదిరిగారు మోడీ. కొండలు గుట్టలు ఎక్కి దిగారు. అత్యంత సాహసాన్ని ప్రదర్శిస్తూ అడవి మొత్తం కలియదిరిగారు. 2019 ఆగస్ట్‌ 12న ప్రపంచవ్యాప్తంగా 180కి పైగా దేశాల్లో డిస్కవరీ నెట్‌వర్క్‌పై ప్రసారమైన మోడీ-బేర్ గ్రిల్స్‌... మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌ అత్యంత ప్రేక్షకాదరణ పొందింది.

ఇక, ఇప్పుడు తన తరువాతి ఎపిసోడ్‌ కోసం తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ను బేర్ గ్రిల్స్‌ ఎంచుకున్నాడు. కర్నాటకలోని బందిపురా అభయారణ్యంలో రజనీతో మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ అడ్వెంచర్‌ ప్రోగ్రామ్‌ను చిత్రీకరించాడు. రెండ్రోజులపాటు బందిపురా టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో రజనీ అండ్ బేర్ గ్రిల్స్ కలిసి తిరిగారు. పులులు అధికంగా ఉండే బందిపురా అభయారణ్యంలో బేర్ గ్రిల్స్, రజనీ సాహసాలు చేశారు. అయితే, షూట్ సందర్భంగా రజనీ గాయపడ్డారనే వార్తలు కలకలం రేపాయి. చిత్రీకరణ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోయారని ప్రచారం జరిగింది. అయితే, తనకేమీ గాయాలు కాలేదని... ఏవో చిన్న ముల్లు గుచ్చుకున్నాయంతే అంటూ రజనీ క్లారిటీ ఇచ్చారు.

మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌లో రజనీ గాయపడ్డారన్న వార్తలతో తమిళ సూపర్‌స్టార్‌తో బేర్ గ్రిల్స్ భారీ సాహస కృత్యాలే చేశారనే ప్రచారం జరుగుతోంది. రజనీ ముల్లు గుచ్చుకున్నాయనే చెబుతున్నా.... బందిపురా టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో బేర్ గ్రిల్స్‌తో కలిసి డేరింగ్‌ మూవెంట్స్‌తో రజనీ పాల్గొన్నట్లు తెలుస్తోంది. దాంతో, రజనీ చేసిన సాహసాలను చూసేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఎదురుచూస్తున్నారు. రజనీ సినిమాలు రికార్డులు సృష్టించినట్లే... బేర్ గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌ కూడా సంచలనాలు నమోదు చేయడం ఖాయమంటున్నారు. అయితే, రజనీ ఎసిపోడ్‌ను ఎప్పుడు ప్రసారం చేస్తారనేది డిస్కవరీ ఛానల్ ఇంకా ప్రకటించలేదు. అయితే, మోడీ ఎపిసోడ్‌కి 4 బిలియన్ల ఇంప్రెషన్స్‌తో సరికొత్త రికార్డులు నమోదుకాగా, ఇప్పుడు రజనీ డాక్యుమెంటరీ ఇంకెన్ని సంచలనాలు సృష్టిస్తుందోనని మాట్లాడుకుంటున్నారు.

ఇక, భారత ప్రధాని నరేంద్రమోడీ.... తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్‌ తర్వాత... బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌తో... బేర్ గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్‌ ప్రోగ్రామ్‌‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అసలే, స్టంట్ మాస్టర్ అయిన అక్షయ్ కుమార్‌తో ... బ్రిటన్ సాహసికుడు బేర్ గ్రిల్స్‌... ఎలాంటి సాహసాలు చేయిస్తారో చూడాలి.