English | Telugu

కరోనా పై విజయం సాధించిన 99 ఏళ్ల మహిళ

కరోనా తీవ్రతకు యువకుల నుండి వృద్దుల వరకు అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందులో కూడా వైరస్ పురుషులకు ఎక్కువగా సోకుతోందని.. ఐతే మృతులలో మాత్రం మహిళలే ఎక్కువగా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. ఐతే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 99 ఏళ్ల వయసున్న బెంగుళూరుకి చెందిన మహిళ కరోనా బారి నుండి బయటపడ్డారు. ఈ భయంకర వైరస్ ఆమెకు ఆమె మనుమడి ద్వారా సోకింది. దీంతో ఆమెను, 70 ఏళ్ల ఆమె కుమారుడు, కోడలు, మనుమడి తో సహా విక్టోరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ నెల 18 న చేర్చారు. ఐతే ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే కుటుంబం లోని ముగ్గురికి జలుబు దగ్గు వంటి లక్షణాలు కనిపించాయి కానీ ఆ వృద్ధ మహిళకు మాత్రం ఎటువంటి లక్షణాలు కనిపించలేదు. హాస్పిటల్ లో చేరిన మొదట్లో ఆమె చికిత్సకు సరిగా సహకరించలేదని ఐతే తరువాత మెల్లమెల్లగా డాక్టర్లు, నర్సులు ధైర్యం చెప్పడంతో ఆమె త్వరగా కోలుకున్నారని ఆమెకు చికిత్స అందించిన డాక్టర్ తెలిపారు. కరోనా వ్యాప్తి మొదలైనప్పటినుండి ఆ వృద్ధ మహిళ మనుమడు తప్పించి మిగిలిన వారు ఎవరు బయటకు వెళ్లకపోయినా వారికి ఈ వైరస్ ఎలా సోకిందో అని వారు ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి 9 రోజుల ట్రీట్ మెంట్ తరువాత 99 ఏళ్ల ఆ మహిళ తన కుటుంబం తో కలిసి వైరస్ పై విజయం సాధించి క్షేమంగా ఇంటికి చేరారు. కర్ణాటక లోనే కరోనా కోరల నుండి బయట పడిన అత్యంత వృద్ధురాలుగా కూడా ఆమె రికార్డులకు ఎక్కారు.