English | Telugu

దివిసీమకు  అక్రమ మార్గంలో చేరుకున్న ఉత్తరకోస్తా మత్స్యకారులు

కృష్ణ జిల్లా దివిసీమవాసులకు కొత్త ఆందోళన మొదలైంది. తమిళనాడు నుంచి నాలుగు బోట్లలో 90మందికి పైగా అక్రమ మార్గంలో నాగాయలంక మండలం ఎదురుమొండి దీవులకు చెఱుకున్నారని, వీరంతా శ్రీకాకుళం జిల్లా వెళ్ళాలని చెపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఎదురుమొండి దీవి వాసులు ఆందోళనలో పడ్డారు. వారిని నిలిపేవేసి అధికారులకు సమాచారం అందించిన ఆపదమిత్రలు, గ్రామస్తులు.

శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన మత్స్య కారులు వేటకోసం సముద్రంలోకి వెళ్ళగా లాక్ డౌన్ ప్రభావంతో చెన్నెలో ఉండిపోయారని, త్రాగునీరు సౌకర్యం లేదని అక్కడ పరిస్థితులు అనుకూలంగా లేవని, తినడానికి తిండి దొరకని పరిస్థితి లో తమ జిల్లాలకు తిరిగి వెళ్లేందుకు సముద్ర మార్గం ద్వారా బయలుదేరారని తెలుపుతున్నారు. సముద్రంలో తుపాను, వర్షం ప్రభావంతో అల్లకల్లోలంగా ఉండటం, వాతావరణం అనుకూలించకపోవటంతో కృష్ణాజిల్లా, నాగాయలంక మండలం, ఎదురుమొండి దగ్గర కృష్ణానదిలోకి బయటకు వచ్చామని తెలిపారు. 5 బోట్లలో సుమారు 92 మంది మత్య్సకారులు ఎదురుమొండి చేరారు.

ఈ విషయమై, మచిలీపట్నం ఆర్డీఓ ఖాజావలి మాట్లాడుతూ, కొంతమంది మత్స్యకారులు సముద్ర మార్గంలో ఎదురుమొండి గ్రామానికి చేరుకున్నారన్న సమాచారంతో అధికారులు విచారించగా వారందరూ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మత్స్యకారులుగా తెలిసింది. వీరందరూ చెన్నై నుండి వారి జిల్లాలకు సముద్ర మార్గంలో తిరుగు ప్రయాణంలో ఉండగా సముద్రంలో వాతావరణం సరిగాలేక నాగాయలంక మండలం ఎదురుమొండి గ్రామానికి చేరుకున్నారు. 92 మందికి ఉండేందుకు అన్ని సదుపాయాలూ సమకూర్చామని, వాతావరణం అనుకూలించాక పై అధికారుల ఆదేశాలనుసారం వారి స్వస్థలాలకు పంపించే ఏర్పాటు చేస్తామని ఆర్ డి ఓ చెప్పారు.