English | Telugu

స్టేట్ హోంలో కలకలం.. 57 మంది బాలికలకు కరోనా.. ఐదుగురు గర్భవతులు!

ఉత్తర ప్రదేశ్‌లో కాన్పూరులోని ఓ ప్రభుత్వ వసతిగృహంలో ఆశ్రయం పొందుతున్న 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్‌గా తేలడం, వారిలో ఐదుగురు గర్భంతో ఉన్నట్టు తెలియడం ప్రకంపనలు సృష్టిస్తోంది. యూపీలో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అధికారులు షెల్టర్‌ హోంలో ఉంటున్న బాలికలకు కరోనా‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో 57 మంది బాలికలకు కరోనా పాజిటివ్ గా తేలింది. అదే సమయంలో ఐదుగురు బాలికలు గర్భంతో ఉన్నట్టు తెలియడంతో ప్రకంపనలు మొదలయ్యాయి.

మహిళా సంఘాలు, ప్రతిపక్షాలు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై సీపీఎం పొలిట్‌ బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలి కాన్పూర్‌ ఎస్‌ఎస్‌పీ దినేష్‌ కుమార్‌ కు ఫిర్యాదు చేశారు. షెల్టర్ హోంలో ఉన్న బాలికలు గర్భవతులు కావడం, వారిలో ఒకరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌, మరొకరికి హెపటైటిస్‌ సీ ఉన్నట్లు వార్తలు వెలువడుతున్నాయని.. దీనిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు.

ఈ విషయంపై స్పందించిన రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు పూనం కపూర్‌.. హోంలో చేరిన తర్వాత ఎవరూ గర్భం దాల్చలేదని.. వారందరూ లైంగిక దాడి బాధితులని పేర్కొన్నారు. కాన్పూర్‌ జిల్లా కలెక్టర్‌ బ్రహ్మదేవ్‌ రామ్‌ తివారి ఈ ఘటన గురించి మాట్లాడుతూ.. ఆశ్రమంలోని సిబ్బంది ఇటీవల ఇద్దరు బాలికలతో కలిసి కాన్పూర్ హాస్పిటల్‌కు వెళ్లారని, అక్కడ కరోనా రోగులతో కాంటాక్ట్ అయిన తర్వాత వీరికి వైరస్ సోకిందని తెలిపారు. వివిధ శిశు సంక్షేమ కమిటీల నుంచి ఇక్కడి హోంకు ఐదుగురు బాలికలు వచ్చారు. వారంతా లైంగిక దాడి బాధితులు. ఇక్కడికి రావడానికి ముందే వారు గర్భవతులుగా ఉన్నారని కలెక్టర్‌ వివరణ ఇచ్చారు.