English | Telugu

తెలంగాణను హడలెత్తిస్తున్న కరోనా.. ఒక్క రోజులోనే ఏకంగా 730 కేసులు

తెలంగాణలో రోజురోజూకీ కరోనా ఉధృతి తీవ్రమవుతోంది. పబ్లిక్ హాలిడే ఐన ఆదివారం రోజున ఏకంగా రిక్డార్డు స్థాయిలో 730 కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ కేసుల్లో జిహెచ్ఎంసి పరిధిలో నే 659 కేసులు నమోదు కాగా, మిగిలిన జిల్లాల్లో 71 కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం కరోనా కేసుల సంఖ్య 7802కు చేరింది. ఇప్పటివరకు కరోనా వైరస్ సోకి తెలంగాణ లో 210 మంది ప్రాణాలు కోల్పోగా, నిన్న ఒక్క రోజు ఏడుగురు మరణించారు. ఇప్పటివరకు కరోనా వైరస్ నుంచి 3731 మంది కోలుకుని హాస్పిటల్స్ నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇంకా 3861 మంది కరోనా వైరస్ చికిత్స తీసుకుంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రం లో 57,054 మంది నుండి శాంపిల్స్ సేకరించి పరీక్షించగా, 49,252 మంది కి వైరస్ నెగిటివ్‌గా తేలింది.

ఒక పక్క నిన్న కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు కు కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం తో అయన ప్రయివేట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు. మరో పక్క హోమ్ మంత్రి మహమూద్ అలీ కార్యాలయంలో కరోనా కలకలం రేగింది. అక్కడ పని చేసే భద్రతా సిబ్బంది ఒకరికి పాజిటివ్ అని తేలడం తో అధికారులు అప్రమత్తమయ్యారు. హోమ్ మంత్రి క్వార్టర్స్ వద్ద విధులలో ఉన్న ఒక హోమ్ గార్డ్ కు కూడా కరోనా నిర్ధారణ ఐన నేపథ్యంలో మంత్రి మహమూద్ అలీ ఇంటి వద్ద నుండి పని చేస్తున్నారు.