English | Telugu
శోకసంద్రంలో తల్లి.. ఖమ్మం జిల్లాలో 16 రోజుల పసికందు అపహరణ
Updated : Nov 27, 2019
నవంబర్ 26వ తేదీ ఉదయం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో వేంసూరు మండలం కందుకూరు గ్రామానికి చెందిన రమాదేవి, నాగరాజు దంపతుల పసిబిడ్డ అపహరణకు గురైంది. ఖమ్మం ధర్మాస్పత్రిలో రమాదేవి 16 రోజుల క్రితం డెలివరీ అయింది. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో కొద్ది రోజులుగా ఉంటున్న రమాదేవిని ఒక మహిళ గమనిస్తూ వచ్చింది. మంగళవారం ఉదయం ఇంజక్షన్ చేయించి తెస్తానంటూ పసికందును తీసుకెళ్లింది. ఎంతసేపటికీ రాకపోవడంతో రమాదేవి ఆస్పత్రి సిబ్బంది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు ఆసుపత్రికి చేరుకుని సీసీ ఫుటేజ్ ని పరిశీలించారు. సైబర్ టీం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అన్ని పోలీస్ స్టేషన్ లను ఎలర్ట్ చేశారు. సైబర్ సిబ్బందితో పాటు పెట్రోలింగ్ సిబ్బంది అలాగే ఇతర పోలీస్ విభాగాలకు చెందిన వారితో 3 బృందాలను ఏర్పాటు చేసి పాప ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బిడ్డను ఎత్తుకెళ్లిన మహిళతో పాటు ముగ్గురు ఉన్నట్టు సమాచారం. ఖమ్మం నగరంతో పాటు విజయవాడ, నందిగామలో దర్యాప్తు చేస్తున్నారు. 2 ప్రత్యేక టీంలు నిందితుల కోసం గాలిస్తున్నాయని తెలిపారు ఖమ్మం సీఐ గోపి.
ఆస్పత్రిలో సీసీ కెమెరాలు అమర్చినా ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం పట్ల రోగుల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. నిత్యం జన సంచారం వైద్య సిబ్బంది కదలికలు.. సెక్యూరిటీ సిబ్బంది నిఘా ఉన్నప్పటికీ శిశువు అపహరణకు గురి కావడం విమర్శలకు తావిస్తుంది. అధికారుల పర్యవేక్షణ లోపంతో పాటు విధుల్లో ఉన్న సిబ్బంది నిర్లక్ష్యం పట్ల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సీసీ కెమెరాలను నమ్ముకుని భద్రతా విషయాల పై దృష్టి సారించడం లేదనే వాదనలున్నాయి. సీసీ కెమెరాలు ఆవరణలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.