English | Telugu
శ్రీకాళహస్తి ఆలయంలో క్షుద్రపూజలు చేసిన ఆలయ ఏఈవో ధనపాల్ అరెస్ట్
Updated : Nov 27, 2019
లంకెబిందెలు..నిధులు.. ఉన్నాయని నమ్మి క్షుద్రపూజలు.. చేతబడులు.. చేస్తునే ఉన్నారు కొందరు అమాయకులు. కానీ అన్ని తెలిసి.. చదువుకున్న మూర్ఖులను తక్కువగా చూస్తూ ఉంటాము. ఆ కోవలోకే చెందుతాడు మన ఆలయ ఏఈవో ధనపాల్. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో క్షుద్రపూజల పై ముఖ్యమంత్రి జగన్ కార్యాలయం ఆరా తీసింది. ఆలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకూడదంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది.
శ్రీకాళహస్తి అనుబంధాలయమైన భైరవకోనలో నవంబర్ 26న అమావాస్య రోజు కొందరు వ్యక్తులు క్షుద్ర పూజలు నిర్వహించినట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనలో తమిళనాడుకు చెందిన ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. పోలీసులు కస్టడీలోకి తీసుకున్న వాళ్లలో ముక్కంటి ఆలయ ఏఈవో ధన్ పాల్ కూడా ఉన్నారు. ఆలయానికి చెందిన ఇద్దరు సెక్యూరిటీ గార్డులు కూడా పోలీసుల విచారణను ఎదుర్కొంటున్నారు. పోలీసుల విచారణలో అనేక విషయాలు బయటపెట్టారు తమిళనాడుకు చెందిన ముఠా. ముక్కంటి ఆలయ ఏఈవో ధన్ పాల్ చెబితేనే క్షుద్ర పూజలు నిర్వహించామని చెప్తున్నారు. భైరవకోన ఆలయంలో నిక్షిప్తమైన నిధుల కోసమే క్షుద్ర పూజలు నిర్వహించారా అనే విషయం విచారణలో తెలియాల్సి ఉంది. ఆలయ ఏఈవో ధన్ పాల్ గతంలో కూడా క్షుద్ర పూజలు నిర్వహిస్తూ సస్పెన్షన్ కు గురయ్యారు.