English | Telugu

మ‌రోసారి త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో సుశాంత్!?

యువ క‌థానాయ‌కుడు సుశాంత్ కెరీర్ లో ప్ర‌త్యేకంగా నిలిచే చిత్రాల్లో `అల వైకుంఠ‌పుర‌ములో` (2020) ఒక‌టి. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ రూపొందించిన ఈ ఫ్యామిలీ ఎంట‌ర్టైన‌ర్ లో రాజ్ మ‌నోహ‌ర్ గా ఓ స్పెష‌ల్ రోల్ లో ఎంట‌ర్టైన్ చేశాడు సుశాంత్. క‌ట్ చేస్తే.. స్వ‌ల్ప విరామం అనంత‌రం మ‌రోమారు త్రివిక్ర‌మ్ తో జ‌ట్టుక‌ట్ట‌నున్నాడ‌ట సుశాంత్.

ఆ వివ‌రాల్లోకి వెళితే.. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు క‌థానాయ‌కుడిగా త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `#SSMB 28` అనే వ‌ర్కింగ్ టైటిల్ తో ఓ సినిమా తెర‌కెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. `అత‌డు` (2005), `ఖ‌లేజా` (2010) త‌రువాత మ‌హేశ్ - త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో రానున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించ‌నుంది. వ‌చ్చే నెల నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌రుపుకోనున్న ఈ సినిమాలో `బుట్ట‌బొమ్మ‌` పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించ‌నుండ‌గా.. యువ సంగీత సంచ‌ల‌నం త‌మ‌న్ బాణీలు అందించ‌నున్నాడు. కాగా, ఈ చిత్రంలోనూ సుశాంత్ కోసం ఓ స్పెష‌ల్ రోల్ డిజైన్ చేశాడ‌ట త్రివిక్ర‌మ్. పాత్ర నిడివి త‌క్కువే అయినా.. ఆస‌క్తిక‌రంగా ఉండ‌డంతో సుశాంత్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడ‌ని బ‌జ్. త్వ‌ర‌లోనే `#SSMB 28`లో సుశాంత్ ఎంట్రీపై క్టారిటీ రానుంది.

ఇదిలా ఉంటే, సుశాంత్ ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజా ర‌వితేజ టైటిల్ రోల్ లో న‌టిస్తున్న `రావ‌ణాసుర‌`లో ఓ ముఖ్య పాత్ర‌లో యాక్ట్ చేస్తున్నాడు. ఇదే ఏడాది ఈ క్రేజీ ప్రాజెక్ట్ రిలీజ్ కానుంది.