English | Telugu

రాజమౌళికి మాఫియా నుంచి బెదిరింపులు..?

బాగా డబ్బున్నవాళ్లని...సోసైటీలో మంచి పేరున్న వాళ్లను బెదిరించి డబ్బు వసూలు చేయడం మనం చాలా సినిమాల్లో చూసుంటాం. అయితే బాలీవుడ్ జనాలకు అక్కడి మాఫియా నుంచి బెదిరింపులు నిత్యకృత్యం. మొన్నామధ్య తమకు 50 లక్షల రూపాయలు ఇవ్వకుంటే మీ కూతురిని చంపేస్తామంటూ హీరోయిన్ అలియా భట్ తండ్రి, ప్రముఖ దర్శక నిర్మాత మహేశ్ భట్‌కు కొందరు గుర్తు తెలియని దుండగులు ఫోన్ చేయడం కలకలం రేపింది. తాజాగా ఈ ట్రెండ్ టాలీవుడ్‌కు పాకినట్లు తెలుస్తోంది.

బాహుబలితో తెలుగు సినిమా స్టామినాని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పారు రాజమౌళి. సుమారు 600 కోట్ల వసూళ్లతో ఒక ప్రాంతీయ చిత్రం ఇంత కలెక్ట్ చేయగలదా అని బాహుబలి నిరూపించింది. దీనికి సీక్వెల్‌గా వస్తోన్న బాహుబలి-2పై అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి అదిరిపోయే బిజినెస్ జరుగుతోందట. కొన్ని బడా డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఎంతైనా ముట్టజెప్పి రైట్స్ చేజిక్కించుకోవడానికి రెడీగా ఉన్నాయి.

అయితే ముంబైకి చెందిన ఓ మాఫియా అక్కడి పెద్ద పెద్ద నిర్మాతలను సైతం వణికిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆ మాఫియా కళ్లు బాహుబలి-2పై పడ్డాయి. బాహుబలి-2 మూవీ రిలీజ్ కంటే ముందుగానే కొంత డబ్బు ఇవ్వాలని వారు ఏకంగా రాజమౌళిని డిమాండ్ చేశారట. లేదంటే సినిమా మొదటి షోకే పైరసీ బయటకు వస్తుందని బెదిరించారని బీ-టౌన్‌లో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. అయితే బాహుబలి-2ని హిందీలో రిలీజ్ చేస్తున్న కరణ్ జోహార్ ప్రస్తుతం ఈ బెదిరింపు కాల్స్‌ని డీల్ చేసే పనిలో పడ్డారట. ఈ వార్తలపై జక్కన్న స్పందించాల్సి ఉంది.