English | Telugu
'ఆచార్య'తో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించనున్న చరణ్?
Updated : May 13, 2022
మొదట్లో టాలీవుడ్‌లోని అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో ఒకటిగా 'ఆచార్య' క్రేజ్ పొందింది. ఈ మూవీలో తండ్రీకొడుకులు చిరంజీవి, రామ్‌చరణ్ హీరోలుగా నటించారు. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో చరణ్ జోడీగా పూజా హెగ్డే నటించింది. అయితే విడుదలకు ముందు ఈ సినిమాకు వచ్చిన క్రేజ్, హైప్.. విడుదలయ్యాక ఆవిరైపోయింది. టాలీవుడ్‌లోనే సెకండ్ బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా ఈ సినిమా నిలిచింది.
ఏప్రిల్ 29న వరల్డ్‌వైడ్‌గా థియేటర్లలో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా విఫలమైంది. దాంతో డిస్ట్రిబ్యూటర్లు, బయ్యర్లు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో వారికి ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాలని రామ్‌చరణ్ నిర్ణయించుకున్నాడంటూ ప్రచారంలోకి వచ్చింది. ఈ సినిమాని మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ నిరంజన్‌రెడ్డితో కలిసి చరణ్ స్వయంగా నిర్మించాడు.
'ఆచార్య' వల్ల భారీ నష్టాలు చవిచూసిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను ఆర్థికంగా ఆదుకుంటానని ఆయన మాటిచ్చినట్లు ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. త్వరలోనే వారందరితో మీటింగ్ ఏర్పాటుచేసి, తన వంతుగా వారికి నష్టపరిహారం చెల్లించనున్నట్లు సమాచారం.
'ఆచార్య' మూవీ కారణంగా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు దాదాపు రూ. 80 కోట్ల మేర నష్టపోయినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. చిరు-చరణ్ కలిసి నటించడం, అంతదాకా కొరటాల శివకు ఫ్లాప్ అనేది లేకపోవడంతో ఈ సినిమాకు భారీ బిజినెస్ జరిగింది. కానీ అందుకు తగ్గట్లు వసూలు రాబట్టంలో సినిమా విఫలమైంది. సినిమా చెత్తగా ఉందనే టాక్‌తో రెండో రోజు నుంచే థియేటర్లు ఖాళీగా మారాయి.