English | Telugu
మహేశ్ తో మరోసారి కృతి!?
Updated : Jun 7, 2022
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన `1 నేనొక్కడినే` (2014)తో కథానాయికగా తొలి అడుగేసింది కృతి సనన్. కట్ చేస్తే.. త్వరలో మరోమారు మహేశ్ సరసన కనువిందు చేయనుందట ఈ స్టన్నింగ్ బ్యూటీ.
ఆ వివరాల్లోకి వెళితే.. `బాహుబలి` సిరీస్, `ఆర్ ఆర్ ఆర్`తో పాన్ - ఇండియా డైరెక్టర్ అనిపించుకున్న దర్శకధీరుడు రాజమౌళి.. తన తదుపరి చిత్రాన్ని మహేశ్ బాబుతో తీయబోతున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ దుర్గా ఆర్ట్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఈ ఏడాది చివరలో లేదా వచ్చే సంవత్సరం ప్రథమార్ధంలో సెట్స్ పైకి వెళ్ళనుంది. కాగా, ఈ సినిమాలో ఇద్దరు నాయికలకు స్థానముందని బజ్. వారిలో ఒకరిగా కృతి సనన్ పేరుని పరిశీలిస్తున్నారని సమాచారం. రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ లో స్టార్ డమ్ అందుకున్న కృతి అయితేనే ఓ పాత్రకి బాగుంటుందని జక్కన్న అండ్ టీమ్ భావిస్తోందట. త్వరలోనే దీనికి సంబంధించి క్లారిటీ రానుంది. మరి.. `1 నేనొక్కడినే`తో ఆశించిన విజయం అందుకోలేకపోయిన మహేశ్ - కృతి సనన్ జోడీ ఈ సారైనా సక్సెస్ బాట పడుతుందేమో చూడాలి.
ఇదిలా ఉంటే, మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా చేస్తున్నారు. ఇక కృతి విషయానికొస్తే.. తన చేతిలో నాలుగు హిందీ చిత్రాలున్నాయి. వాటిలో ఒకటైన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ `ఆదిపురుష్` 2023 సంక్రాంతికి రిలీజ్ కానుంది.