English | Telugu

బాల‌య్య‌కి జోడీగా శివాజీ హీరోయిన్!

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం `క్రాక్` కెప్టెన్ గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ యాక్ష‌న్ డ్రామా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మిస్తున్న ఈ భారీ బ‌డ్జెట్ వెంచ‌ర్ లో చెన్నై పొన్ను శ్రుతి హాస‌న్ ఓ హీరోయిన్ గా న‌టిస్తోంది. లేటెస్ట్ బ‌జ్ ఏంటంటే.. ఇందులో మ‌రో హీరోయిన్ గా ఓ మ‌ల‌యాళ ముద్దుగుమ్మ ద‌ర్శ‌న‌మివ్వ‌బోతోంద‌ట‌.

ఆమె మ‌రెవ‌రో కాదు.. హ‌నీ రోజ్. మ‌ల‌యాళం, త‌మిళ్, తెలుగు, క‌న్న‌డ‌.. ఇలా ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలోనూ సంద‌డి చేసిన హ‌నీ.. గ‌తంలో శివాజీ హీరోగా న‌టించిన `ఆల‌యం`(2008)లో నాయిక‌గా న‌టించింది. అలాగే, వ‌రుణ్ సందేశ్ `ఈ వ‌ర్షం సాక్షిగా` (2013)లోనూ అల‌రించింది. క‌ట్ చేస్తే.. సుదీర్ఘ విరామం అనంత‌రం మళ్ళీ ఇప్పుడు బాల‌య్య‌కి జంట‌గా క‌నిపించేందుకు సిద్ధ‌మైంది. త్వ‌ర‌లోనే బాల‌య్య - గోపీచంద్ కాంబో మూవీలో హ‌నీ రోజ్ ఎంట్రీపై క్లారిటీ రానుంది. మ‌రి.. మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్, సురేశ్ గోపీ, జ‌య‌రామ్, దిలీప్ వంటి సీనియ‌ర్ స్టార్స్ స‌ర‌స‌న మెప్పించిన హ‌నీ రోజ్.. తెలుగునాట బాల‌కృష్ణ జోడీగానూ మురిపిస్తుందేమో చూడాలి.