English | Telugu

పవన్‌ కళ్యాణ్‌కు గట్టి షాక్‌ ఇచ్చిన అమెజాన్‌.. అసలేం జరిగింది?

2018లో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ వరకు ఏడాదికో, రెండేళ్ళకో సినిమా చేస్తూ వచ్చిన పవన్‌కళ్యాణ్‌ ఈ సినిమా తర్వాత మూడేళ్ళు గ్యాప్‌ తీసుకొని ‘వకీల్‌ సాబ్‌’ చిత్రం చేశారు. ఆ తర్వాత వరసగా భీమ్లా నాయక్‌, బ్రో చిత్రాల్లో నటించారు. అంతకుముందే హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్‌ చిత్రాలు ఎనౌన్స్‌ చేశారు. ఈ మూడు సినిమాల కంటే ముందు సురేందర్‌రెడ్డితో పవన్‌కళ్యాణ్‌ ఒక సినిమా చేస్తున్నారంటూ పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు. కానీ, అది పోస్టర్‌ వరకే పరిమితమైంది. ఆ తర్వాత దాని గురించి మర్చిపోయారు. ఇక హరిహర వీరమల్లు, ఓజి, ఉస్తాద్‌ భగత్‌ సింగ్‌ చిత్రాలు లైన్‌లో ఉన్నాయి. వీటిలో హరిహర వీరమల్లు, ఓజి చిత్రాలు కొంత షూటింగ్‌ జరిగిన తర్వాత పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల్లో బిజీ అయిపోయారు. ఆ తర్వాత ఎలక్షన్స్‌ రావడం, జనసేన పార్టీ ఘనవిజయం సాధించడం జరిగిపోయాయి. అంతేకాదు, పవన్‌కళ్యాణ్‌ డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టడంతో ఆయన కమిట్‌ అయిన సినిమాలు కష్టాల్లో పడ్డాయి. అవి ఎప్పుడు పూర్తవుతాయో కూడా తెలీని అయోమయ పరిస్థితి నెలకొంది.

డిప్యూటీ సీఎం పదవిలో బిజీగా ఉన్నప్పటికీ తనకు వీలు దొరికినప్పుడల్లా ఈ సినిమాలు పూర్తి చేసేందుకు కొంత సమయం కేటాయిస్తూ వస్తున్నారు పవన్‌కళ్యాణ్‌. అలా హరిహర వీరమల్లు చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఇక ఓజి విషయానికి వస్తే.. మరో వారం, పదిరోజులు ఈ సినిమాకి కేటాయిస్తే అది కూడా పూర్తవుతుంది. ఇక మిగిలింది ఉస్తాద్‌. ఈ సినిమా ఎనౌన్స్‌ చేసిన తర్వాత ఓ నాలుగు రోజులు షూటింగ్‌ జరిపి దానికి సంబంధించిన గ్లింప్స్‌ వదిలి హడావిడి చేశారు. కానీ, ఆ తర్వాత ఆ సినిమా గురించి పట్టించుకున్నవారు లేరు. దాంతో అసలు ఆ సినిమా ఉందా అనే సందేహం కూడా అందరికీ కలుగుతోంది. ఈ క్రమంలోనే అమెజాన్‌.. పవన్‌కళ్యాణ్‌కు, ఉస్తాద్‌ యూనిట్‌కి గట్టి షాక్‌ ఇచ్చింది. ఈ సినిమా ఎనౌన్స్‌మెంట్‌ జరిగిన తర్వాత ఓటీటీ హక్కులు తీసుకునేందుకు అమెజాన్‌ ముందుకు వచ్చింది.

నాలుగైదు రోజులు జరిగిన షూటింగ్‌ వరకే ఉస్తాద్‌ సినిమా పరిమితమైంది. ఈ సినిమాకి సంబంధించిన గ్లింప్స్‌ని మాత్రం థియేటర్లలో రిలీజ్‌ చేశారు. అది పార్టీ ప్రచారానికి బాగా పనికొచ్చింది. ఒక పక్క హరిహర వీరమల్లు, ఓజి షూటింగ్‌ అప్పుడప్పుడు జరుగుతున్నా ఉస్తాద్‌ని మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఈ సినిమా ఓటీటీ హక్కులు తీసుకుంటామని హామీ ఇచ్చిన అమెజాన్‌ తన హామీని వెనక్కి తీసుకుందని తెలుస్తోంది. ఉస్తాద్‌ షూటింగ్‌ ఎప్పుడు మొదలవుతుందో తెలీదు. ఎప్పుడు రిలీజ్‌ అవుతుందో అంతకంటే తెలీదు. తమకు ఇచ్చిన టైమ్‌ లోపు సినిమా రాలేదు కాబట్టి ఇచ్చిన హామీని వెనక్కి తీసుకునే అవకాశం అమెజాన్‌కి ఉంటుంది. ఇప్పుడు అదే పని చేసిందని తెలుస్తోంది. ఇప్పటికైనా ఈ సినిమాపై జరుగుతున్న ప్రచారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టి షూటింగ్‌ మొదలు పెడతారో లేదో చూడాలి.