Read more!

English | Telugu

"అయ్యో అయ్యో అయ్యయ్యో".. అప్పుడే 33 ఏళ్ళయిందా!?

విక్టరీ వెంకటేశ్ నటజీవితంలో పలు ఘనవిజయాలు ఉన్నాయి. వాటిలో 'బొబ్బిలి రాజా'ది ప్రత్యేక స్థానం. వెంకీ కెరీర్ లో ఇదే తొలి సిల్వర్ జూబ్లీ హిట్ కావడమే అందుకు ఓ కారణం. ఇక.. "అయ్యో అయ్యో అయ్యయ్యో" అంటూ ఇందులో వెంకటేశ్ చేసిన సందడిని అంత సులువుగా మరిచిపోలేం. ప్రముఖ దర్శకుడు బి. గోపాల్ తెరకెక్కించిన ఈ సినిమాతోనే అందాల తార దివ్యభారతి తెలుగువారికి పరిచయమైంది. దివ్యభారతికి తల్లిగా కళాభినేత్రి వాణిశ్రీ నటించిన ఈ చిత్రంలో కోట శ్రీనివాస రావు, సత్యనారాయణ, బ్రహ్మానందం, సుమిత్ర, శివాజీ రాజా, బాబూ మోహన్, ప్రదీప్ శక్తి, జయప్రకాశ్ రెడ్డి ఇతర ముఖ్య పాత్రల్లో దర్శనమిచ్చారు. 

మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా బాణీలు బొబ్బిలి రాజాకి ప్రధాన బలంగా నిలిచాయి. "బలపం పట్టి భామ ఒళ్ళో", "కన్యాకుమారి", "వద్దంటే వినడే", "అయ్యో అయ్యో", "చెమ్మ చెక్క".. ఇలా ఇందులోని ఐదు పాటలూ అప్పట్లో ఉర్రూతలూగించాయి. అంతేకాదు.. ఈ సినిమాకి గానూ ఇళయరాజా ఖాతాలో ఓ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా చేరడం విశేషం. 1990 హయ్యస్ట్ గ్రాసర్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన 'బొబ్బిలి రాజా'.. 3 కేంద్రాలలో 175 రోజులు ప్రదర్శితమైంది. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై డి. సురేశ్ బాబు నిర్మించిన 'బొబ్బిలి రాజా'.. 1990 సెప్టెంబర్ 14న జనం ముందు నిలిచింది. నేటితో ఈ బ్లాక్ బస్టర్ మూవీ.. 33 వసంతాలు పూర్తిచేసుకుంది.