English | Telugu

ఆ విషయంలో నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి.. ఆలోచించండి!

(డిసెంబర్‌ 31 ఆర్‌.నారాయణమూర్తి పుట్టినరోజు సందర్భంగా..)

‘భద్రం బీకేర్‌ఫుల్‌ బ్రదరు.. భర్తగ మారకు బ్యాచ్‌లరు..’, ‘వద్దుర సోదరా.. పెళ్లంటే నూరేళ్ళ మంటరా..’.. ఇది కొంతమంది మగవారి నిశ్చితాభిప్రాయం. దానికి తగ్గట్టుగానే ఎంత వయసు వచ్చినా బ్యాచ్‌లర్‌ లైఫ్‌నే లీడ్‌ చేస్తున్నారు. మారుతున్న సామాజిక పరిస్థితుల వల్ల ఇప్పటి యూత్‌ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్న మాట వాస్తవం. కానీ, 50 ఏళ్ల క్రితమే పీపుల్స్‌ స్టార్‌ ఆర్‌.నారాయణమూర్తి పెళ్లి వద్దు, భార్య వద్దు అని భీష్మించుకొని కూర్చున్నారు. 70 ఏళ్ళ వయసు వచ్చినప్పటికీ బ్యాచ్‌లర్‌గానే కొనసాగుతున్నారు. అయితే కొన్నేళ్ల క్రితమే ఆయన ఈ విషయంలో రియలైజ్‌ అయ్యారు. పెళ్లి చేసుకోకపోవడం వల్ల జరిగే అనర్థాల గురించి తెలుసుకున్నారు. తను పెళ్లి చేసుకోకుండా ఎందుకు ఉండాల్సి వచ్చింది. అలాంటి నిర్ణయం తీసుకోవడం వల్ల ఇప్పుడు తన మానసిక పరిస్థితి ఎలా ఉంది అనే విషయాల గురించి ప్రస్తావించారు ఆర్‌.నారాయణమూర్తి.

‘నేను ఒక సాధారణ వ్యక్తిని. సింపుల్‌గా ఉండేందుకే ఎక్కువ ఇష్టపడతాను. ఎందుకంటే నేను పెరిగిన వాతావరణం అలాంటిది. సింపుల్‌గా ఉండడంలోనే నాకు ఆనందం ఉంది. ఇల్లు, కారు అంటూ సొంత ఆస్తులు కూడబెట్టకూడదు అనేది చిన్నతనం నుంచి నాకు ఉన్న ఆలోచన. మా సినిమా వాళ్లకి చాలామందికి ఇళ్లు ఇచ్చారు. నన్ను కూడా తీసుకోమని చెప్పారు. కానీ, నేను తీసుకోలేదు.

ఇక పెళ్లి విషయానికి వస్తే.. నా జీవితంలోనూ ఒక ప్రేమ కథ ఉంది. చదువుకునే రోజుల్లోనే నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. పెళ్లి విషయం మాట్లాడేందుకు వాళ్ళ ఇంటికి వెళ్లినపుడు తెలిసింది. వాళ్లు చాలా డబ్బున్నవారు. వాళ్ల స్థాయి వేరు, నా స్థితి వేరు. ఇద్దరికీ పొసగదు అనే నిర్ణయం తీసుకొని ఆ క్షణమే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయించుకున్నాను. నా నిర్ణయం విని ఆ అమ్మాయి చాలా బాధపడిరది. అయినా నేను నా నిర్ణయం మార్చుకోలేదు. అంతేకాదు, అప్పటి నుంచి ఒంటరి జీవితాన్నే గడుపుతున్నాను.

సినిమాల్లో తెలియకుండానే కాలం గడిచిపోయింది. 50 ఏళ్లు దాటిన తర్వాత పెళ్లి చేసుకోలేదన్న బాధ మొదలైంది. ఎందుకిలా చేశాను అనిపించింది. నాకంటూ ఒక మనిషి, ఒక ఇల్లు ఉంటే బాగుండేది అనుకున్నాను. పెళ్లి, ఇల్లు లేకుండా ఇప్పటివరకు నా జీవితాన్ని నెట్టుకుంటూ వచ్చాను. దీని గురించి ఇంటి దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నప్పుడు రెండు పక్షులు ఎగురుకుంటూ గూటిలోకి వెళ్ళడం చూశాను. జంటగా ఉండడం అనేది ప్రకృతి ధర్మం. ప్రతి మనిషికి తోడు, నీడ చాలా అవసరం. అది నా స్వానుభవంతో తెలుసుకున్నాను.

పెళ్లి చేసుకోకుండా బ్యాచ్‌లర్స్‌గా ఉండిపోవాలనే ఆలోచన కొంతమంది కుర్రాళ్లలో కూడా ఉంది. కానీ, దాన్ని పక్కన పెట్టండి. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో జరిగిపోవాలి. పెళ్లి వయసు వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోండి. పిల్లల్ని కనండి. ఇల్లు కట్టుకోండి. కార్లు కొనుక్కోండి. లగ్జరీ లైఫ్‌ని ఎంజాయ్‌ చెయ్యండి. హాయిగా ఉండండి. నేను చేసిన తప్పు మీరు చెయ్యకండి. నా అనుభవంతో చెబుతున్నాను’ అంటూ నేటి యువతకు సందేశాన్ని ఇచ్చారు ఆర్‌.నారాయణమూర్తి.