English | Telugu
ఒకే సంవత్సరం 8 సినిమాలు.. అందులో 5 బ్లాక్‌బస్టర్స్.. అదీ శోభన్‌బాబు స్టామినా!
Updated : Jan 14, 2026
(జనవరి 14 శోభన్‌బాబు జయంతి సందర్భంగా..)
1937 జనవరి 14న కృష్ణా జిల్లాలో జన్మించిన ఉప్పు శోభనాచలపతిరావు అలియాస్ శోభన్‌బాబు తెలుగు చలన చిత్ర రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను ఏర్పరుచుకున్న హీరో. తను హీరోగానే రిటైర్ అవుతాను తప్ప క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రేక్షకులకు కనిపించకూడదు అని దృఢంగా నిశ్చయించుకున్న ఆయన.. హీరోగానే రిటైర్ అయ్యారు. ఆ తర్వాత తండ్రిగా, తాతగా నటించే అవకాశాలు ఎన్ని వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేయలేదు. శోభన్‌బాబు కెరీర్ ఎంతో విలక్షణంగా సాగింది. హీరోగా తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఎన్నో కష్టాలు పడ్డారు. 1959లో దైవబలం చిత్రంతో నటుడిగా చిత్ర రంగ ప్రవేశం చేసిన శోభన్‌బాబు.. సోలో హీరో అవ్వడానికి 7 సంవత్సరాలు పట్టింది. పాతిక సినిమాల్లో చిన్న క్యారెక్టర్లు, కొంత ప్రాధాన్యం ఉన్న క్యారెక్టర్లు చెయ్యాల్సి వచ్చింది.
హీరోగా నిలదొక్కుకున్న తర్వాత ఆయన్ని స్టార్ హీరోని చేసిన సంవత్సరం 1975. శోభన్‌బాబు కెరీర్‌లో ఈ సంవత్సరానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఈ సంవత్సరం ఆయన నటించిన 8 సినిమాలు రిలీజ్ కాగా, అందులో 5 సినిమా బ్లాక్‌బస్టర్స్‌గా, శతదినోత్సవ సినిమాలుగా నిలిచాయి. అంతేకాదు, తను చేసిన సినిమాల మధ్యే పోటీ ఏర్పడడం విశేషంగా చెప్పుకోవచ్చు.
1975 సంవత్సరం జనవరిలో తాతినేని రామారావు దర్శకత్వంలో రూపొందిన ‘దేవుడు చేసిన పెళ్లి’ చిత్రం విడుదలైంది. శోభన్‌బాబు హీరోగా నటించిన తొలి కలర్ సినిమా ఇదే. ఈ సినిమాలో శారద ద్విపాత్రాభినయం చేశారు. చక్కని కథ, గుండెల్ని పిండేసే సెంటిమెంట్ ప్రధానంగా సాగే ఈ సినిమాను 15 కేంద్రాల్లో 50 రోజులు, 3 కేంద్రాల్లో 100 రోజులు ప్రదర్శించారు. తెలుగు చలన చిత్ర చరిత్రలోనే తొలిసారి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని థియేటర్లలో ఉదయం ఆటను ప్రత్యేకంగా మహిళల కోసం కేటాయించారు.
ఏప్రిల్‌లో ఎస్.ఎస్.బాలన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘అందరూ మంచివారే’. అంతకుముందు ‘మంచి మనుషులు’ వంటి సూపర్‌హిట్ చిత్రంలో కలిసి నటించిన శోభన్‌బాబు, మంజుల ఈ సినిమాలో మరోసారి జోడీ కట్టారు. సాంఘిక చిత్రాల్లో తొలిసారి ఈ సినిమా కోసం 6 లక్షల రూపాయలతో ఒక భారీ సెట్‌ను నిర్మించడం విశేషం. అయితే ఈ సినిమా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేదు.
మే నెలలో కె.రాఘవేంద్రరావు దర్శకుడుగా రూపొందిన తొలి సినిమా ‘బాబు’ విడుదలైంది. ఇందులో శోభన్‌బాబు, వాణిశ్రీ, అరుణా ఇరానీ ప్రధాన పాత్రల్లో నటించారు. 25 లక్షల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమాకి మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. తొలివారం 16 లక్షలు కలెక్ట్ చేయడం విశేషం. రెండు వారాల వరకు ఫర్వాలేదు అనిపించినా ఆ సమయంలోనే శోభన్‌బాబు, వాణశ్రీలతోనే కె.విశ్వనాథ్ రూపొందించిన ‘జీవనజ్యోతి’ విడుదలై ఘనవిజయం సాధించడంతో ‘బాబు’ చిత్రంపై ఆ ప్రభావం పడింది. ఫలితంగా ‘బాబు’ ఏవరేజ్ మూవీగా నిలిచింది.
శోభన్‌బాబు, శారద జంటగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన ‘బలిపీఠం’ చిత్రం జూలై 17న విడుదలైంది. రంగనాయకమ్మ కథ ఆధారంగా రూపొందిన ఈ సినిమా ఘనవిజయం సాధించింది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల్ని ఈ సినిమా విపరీతంగా ఆకట్టుకుంది. శోభన్‌బాబు, శారద నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
శోభన్‌బాబు, మంజుల జంటగా వి.మధుసూదనరావు దర్శకత్వంలో రూపొందిన ‘జేబుదొంగ’ చిత్రం ఆగస్ట్ 14న విడుదలైంది. అప్పటి వరకు ప్రేమకథా చిత్రాలు, కుటుంబ కథా చిత్రాలు చేస్తూ వచ్చిన శోభన్‌బాబుపై జేబుదొంగ అనే టైటిల్ వర్కవుట్ అవ్వదని, తప్పకుండా ఫ్లాప్ అవుతుందని ఇండస్ట్రీలోని ప్రముఖులు భావించారు. కానీ, వారి అంచనాలను తారుమారు చేస్తూ సినిమా సూపర్‌హిట్ అయింది. ఈ సినిమా తర్వాత నవంబర్‌లో ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో శోభన్‌బాబు, మంజుల జంటగా వచ్చిన ‘గుణవంతుడు’ చిత్రం పెద్దగా ఆడలేదు.
ఇక ఈ సంవత్సరం డిసెంబర్ 19న వచ్చిన ‘సోగ్గాడు’ చిత్రం సంచలన విజయం సాధించి శోభన్‌బాబు పేరుకు ముందు సోగ్గాడు చేరింది. కె.బాపయ్య దర్శకత్వంలో డి.రామానాయుడు నిర్మించిన ఈ సినిమాలో జయచిత్ర, జయసుధ హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయి శోభన్‌బాబు కెరీర్‌లో ఓ మైల్‌స్టోన్ మూవీగా నిలిచింది. ఈ సినిమా మ్యూజికల్‌గా కూడా చాలా పెద్ద విజయం సాధించింది. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో మరో సినిమాతో కె.బాపయ్య బిజీగా ఉండడంతో హైదరాబాద్‌లో కొన్ని సన్నివేశాలను ఆయన కజిన్ కె.రాఘవేంద్రరావు చిత్రీకరించడం విశేషం. 1975లో శోభన్‌బాబు హీరోగా వచ్చిన 8 కలర్ సినిమాల్లో 5 సినిమాలు ఘనవిజయం సాధించాయి. అలా ఈ సంవత్సరం శోభన్‌బాబు కెరీర్‌లో ఓ ప్రత్యేకమైన సంవత్సరంగా నిలిచింది.