English | Telugu

వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్..  టాప్ 10 మూవీస్ ఇవే!!

వైజయంతీ మూవీస్ అధినేత సి. అశ్వనీదత్..  టాప్ 10 మూవీస్ ఇవే!!

భారీ బడ్జెట్ చిత్రాలకు చిరునామాగా నిలిచిన టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో వైజయంతీ మూవీస్ సంస్థ అధినేత సి. అశ్వనీదత్ ఒకరు. కెరీర్ ఆరంభం నుంచే ఈ తరహా సినిమాలతో పరిశ్రమ దృష్టిని విశేషంగా అలరించారాయన. అశ్వనీదత్ బర్త్ డే సందర్భంగా.. బాక్సాఫీస్ ని షేక్ చేసిన వైజయంతీ మూవీస్ వారి టాప్ 10 సినిమాలేంటో చూద్దాం..

1. ఎదురులేని మనిషి: నటరత్న నందమూరి తారక రామారావు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. కె. బాపయ్య రూపొందించిన ఈ సినిమాతోనే సి. అశ్వనీదత్ నిర్మాణరంగంలోకి ప్రవేశించారు. 1975లో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. 
2. అడవి సింహాలు: సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణంరాజు కాంబినేషన్ లో కె. రాఘవేంద్ర రావు తెరకెక్కించిన సినిమా ఇది. 1983లో రిలీజైన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి సక్సెస్ చూసింది. 
3. అగ్ని పర్వతం: సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. 1985 సంక్రాంతికి సందడి చేసిన ఈ మూవీని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు తీర్చిదిద్దారు.
4. ఆఖరి పోరాటం: 1988 హయ్యస్ట్ గ్రాసర్స్ లో ఆఖరి పోరాటం ఒకటి. కింగ్ నాగార్జున, అతిలోక సుందరి శ్రీదేవి కాంబినేషన్ లో కె. రాఘవేంద్రరావు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్టైనర్ ఇది.
5. జగదేక వీరుడు అతిలోక సుందరి: మెగాస్టార్ చిరంజీవి, ఆల్ ఇండియా సూపర్ స్టార్ శ్రీదేవి టైటిల్ రోల్స్ లో నటించిన ఈ సినిమాకి కె. రాఘవేంద్రరావు దర్శకుడు. 1990 వేసవిలో విడుదలై సంచలన విజయం సాధించిందీ సినిమా. 
6. చూడాలని వుంది: మెగాస్టార్ చిరంజీవి, అభినేత్రి సౌందర్య కాంబినేషన్ లో గుణశేఖర్ తెరకెక్కించిన ఈ సినిమా.. 1998 సంవత్సరంలో హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
7. రాజకుమారుడు: సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా నటించిన తొలి చిత్రమిది. కె. రాఘవేంద్రరావు తీర్చిదిద్దిన ఈ మూవీ.. 1999లో జనం ముందు నిలిచింది. ఇందులో మహేశ్ తండ్రి, సూపర్ స్టార్ కృష్ణ అతిథి పాత్రలో మెరిశారు.
8. ఆజాద్: నాగార్జున, సౌందర్య కాంబినేషన్ లో అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి తిరుపతి స్వామి దర్శకత్వం వహించారు. 2000లో వచ్చిన ఈ చిత్రం.. మంచి విజయం సాధించింది. 
9. ఇంద్ర: చిరంజీవి కాంబినేషన్ లో సి. అశ్వనీదత్ హ్యాట్రిక్ మూవీ 'ఇంద్ర'. 2002లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీకి బి. గోపాల్ దర్శకత్వం వహించారు.
10. చిరుత: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ని హీరోగా పరిచయం చేస్తూ సి. అశ్వనీదత్ నిర్మించిన సినిమా ఇది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీ.. బాక్సాఫీస్ ముంగిట ఘనవిజయం సాధించింది. 

వీటితో పాటు వైజయంతీ మూవీస్ సమర్పణలో వచ్చిన 'స్టూడెంట్ నెం.1', 'మహానటి', 'సీతారామం' కూడా అఖండ విజయం సాధించాయి. అలాగే సి. అశ్వనీదత్ సహ నిర్మాణంలో వచ్చిన 'శుభలగ్నం', 'పెళ్ళి సందడి', 'పెళ్ళాం ఊరెళితే', 'గంగోత్రి', 'మహర్షి' కూడా వసూళ్ళ వర్షం కురిపించాయి.  

(సెప్టెంబర్ 15.. సి. అశ్వనీదత్ పుట్టినరోజు సందర్భంగా)