English | Telugu

వంశీ ‘అన్వేషణ’ కి హ్యాండిచ్చిన యండమూరి. ఎందుకో తెలుసా?

వంశీ ‘అన్వేషణ’ కి హ్యాండిచ్చిన యండమూరి. ఎందుకో తెలుసా?

డైరెక్టర్‌ వంశీ కెరీర్‌లో ‘అన్వేషణ’ చిత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. ఒక చిన్న సినిమాగా వచ్చిన ‘అన్వేషణ’ పెద్ద విజయాన్ని సాధించి శతదినోత్సవం జరుపుకుంది. ఈ సినిమాకి చాలా మంది ఫ్యాన్స్‌ ఉన్నారు. అందులో రామ్‌గోపాల్‌వర్మ ఒకరు. తనకెంతో ఇష్టమైన సినిమా అది అని వర్మ చెబుతారు. ఆ ఇష్టంతోనే వంశీ డైరెక్షన్‌లో వర్మ ఓ సినిమా నిర్మించాడు కూడా. అయితే అన్వేషణ అనే సినిమా రూపొందడానికి వెనుక చాలా ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అప్పటికే మంచుపల్లకి, ఆలాపన చిత్రాలు తీసి సెన్సిబుల్‌ డైరెక్టర్‌ అనిపించుకున్న వంశీతో ఓ సినిమా చెయ్యాలనుకున్నాడు నిర్మాత కామినేని ప్రసాద్‌. నీకు ఏ కథ ఇష్టమైతే దానితోనే సినిమా చేద్దాం ఆలోచించు అన్నారు ప్రసాద్‌. 
వంశీ కెరీర్‌లో కొన్ని సెన్సిబుల్‌ మూవీస్‌, కామెడీ మూవీస్‌ చేశాడు. కానీ, స్వతహాగా ఆయనకి సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ ఇష్టమట. సినిమా కథ విషయం తనకు వదిలేయడంతో తనకిష్టమైన సినిమా చేద్దామనుకుని సిద్ధమయ్యాడు. అప్పట్లో కన్నడలో  కాశీనాథ్‌ డైరెక్షన్‌లో వచ్చిన ‘అపరిచితులు’ తెలుగులోనూ విడుదలై ఘనవిజయం సాధించింది. దాన్ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని ఒక కథ రెడీ చెయ్యాలనుకున్నాడు. అయితే తెలుగులో అప్పట్లో సస్పెన్స్‌ థ్రిల్లర్స్‌ తరహా స్క్రిప్టు రాసే రచయితలు లేరు. దర్శకులే అలాంటి స్క్రిప్ట్‌ను రాసుకోవాలి. అయినా కొంతమంది రచయితలు ‘అన్వేషణ’ స్క్రిప్ట్‌ను రెడీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, ఎవ్వరి వల్లా కాలేదు. కొందరు మధ్యలోనే స్క్రిప్ట్‌ వదిలి వెళ్ళిపోయారు. అందులో ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌ కూడా ఉన్నారు. ఆ కథను పూర్తి చేయడం యండమూరి వల్ల కూడా కాలేదు. అయినా ‘ఈ సినిమాకి ఒక వెర్షన్‌ రాసి ఇచ్చేందుకు ప్రయత్నించిన యండమూరి వీరేంద్రనాథ్‌గారికి కృతజ్ఞతలు’ అని టైటిల్స్‌లో వేశారు. ఎవరు ఎన్ని రకాలుగా రాసినా వంశీ అనుకున్నట్టు కథ తయారవ్వలేదు. చివరకు తనే ఆ కథను పూర్తి చేశాడు. 
ఇక షూటింగ్‌కి వెళ్దామనుకుంటూ వుండగా ఇందిరాగాంధీ చనిపోవడం, ఆ తర్వాత తుపాను రావడం వంటి కారణాల వల్ల షూటింగ్‌ డిలే అయిపోయింది. ఈలోగా తను రాసుకున్న కథని నవలగా అచ్చు వేయించాడు వంశీ. ఆ నవల చదివిన నిర్మాత చాలా బాగుందని మెచ్చుకోవడం, షూటింగ్‌ ప్రారంభించడం జరిగిపోయాయి. తిరుపతి దగ్గరలోని తలకోన ఫారెస్ట్‌లో తోట తరణి వేసిన సెట్‌లో షూటింగ్‌ ప్రారంభించారు వంశీ. కార్తీక్‌, భానుప్రియ, శరత్‌బాబు, సత్యనారాయణ, రాళ్ళపల్లి తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ఈ సినిమాకి ఇళయరాజా అందించిన సంగీతం ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.