Read more!

English | Telugu

ఎన్టీఆర్ సపోర్ట్ తోనైనా హృతిక్ ఆ ఫీట్ సాధిస్తాడా?

బాలీవుడ్ టాప్ స్టార్స్ లో హృతిక్ రోషన్(Hrithik Roshan) ఒకడు. రెండు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్ లో పలు ఘన విజయాలను సాధించి, ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే ఈమధ్య కాలంలో ఇతర స్టార్స్ తో పోలిస్తే.. బాక్సాఫీస్ లెక్కల పరంగా హృతిక్ చాలా వెనకబడిపోయాడు. హృతిక్ కి సీనియర్, జూనియర్ స్టార్స్ అయిన.. ఆమిర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్ ఇలా అందరూ సోలో గానో మల్టీస్టారర్ తోనో రూ.500 కోట్ల గ్రాస్ క్లబ్ లో చేరారు. ఆమిర్, షారుఖ్ అయితే వెయ్యి కోట్ల క్లబ్ లో కూడా చేరారు. అలాగే సల్మాన్, రణబీర్ కెరీర్స్ లో రూ.900 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టిన సినిమాలు ఉన్నాయి. అలాంటిది ఇంతవరకు హృతిక్ 500 కోట్ల క్లబ్ లో చేరకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ఇప్పటిదాకా హృతిక్ రోషన్ కెరీర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా 'వార్' నిలిచింది. 2019లో వచ్చిన ఈ యాక్షన్ థ్రిల్లర్ వరల్డ్ వైడ్ గా రూ.475 కోట్ల గ్రాస్ రాబట్టి, 500 కోట్ల క్లబ్ కి కాస్త దూరంలో ఆగిపోయింది. 'వార్' తర్వాత ఇప్పటివరకు హృతిక్ నుంచి రెండు సినిమాలు మాత్రమే వచ్చాయి. అందులో 'విక్రమ్ వేద' రూ.135 కోట్ల గ్రాస్ కే పరిమితం కాగా, ఇటీవల విడుదలైన 'ఫైటర్' దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ దాకా రాబట్టింది. దీంతో హృతిక్ తన తదుపరి సినిమాతోనైనా 500 కోట్ల క్లబ్ లో చేరతాడా అనే ఆసక్తి నెలకొంది.

హృతిక్ నటిస్తున్న తదుపరి చిత్రం 'వార్-2'. యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్ లో భాగంగా రూపొందుతోన్న సినిమా కావడం, అందునా బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'వార్'కి సీక్వెల్ కావడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. అన్నింటికంటే మించి ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) నటిస్తుండటం విశేషం. ఇప్పటికే 'ఆర్ఆర్ఆర్'తో రూ.1000 కోట్ల క్లబ్ లో చేరిన ఎన్టీఆర్.. ఆ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా మారిపోయాడు. ప్రస్తుతం తారక్ నటిస్తున్న 'దేవర' చిత్రం కనీసం రూ.500 కోట్ల గ్రాస్ రాబడుతుందనే అంచనాలున్నాయి. టాక్, కంటెంట్ తో సంబంధం లేకుండా ప్రతి సినిమాకి రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టగల మార్కెట్ ప్రస్తుతం ఎన్టీఆర్ సొంతం. మరోవైపు హృతిక్ కూడా తన స్టార్డంతో రిజల్ట్ తో సంబంధం లేకుండా 300 కోట్లు రాబట్టగలడు. అలాంటిది ఈ ఇద్దరు కలిస్తే టాక్ తో సంబంధం లేకుండానే 'వార్-2' చిత్రం 500 కోట్ల క్లబ్ లో చేరే అవకాశముంది. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే వెయ్యి కోట్ల క్లబ్ లో చేరడం కూడా పెద్ద విషయమేమీ కాదు.