Read more!

English | Telugu

ఎట్టకేలకు ఓటీటీలోకి 'కేరళ స్టోరీ'

జయాపజయాలతో సంబంధం లేకుండా మెజారిటీ సినిమాలు నాలుగు వారాలకే ఓటీటీలోకి అడుగు పెడుతున్నాయి. అయితే గతేడాది విడుదలైన బ్లాక్ బస్టర్ ఫిల్మ్ 'ది కేరళ స్టోరీ' మాత్రం తొమ్మిది నెలలు దాటినా ఓటీటీలోకి రాలేదు. తమ సినిమాకి ఓటీటీ సంస్థల నుంచి సరైన ఆఫర్లు రావడంలేదని, దీని వెనుక కొందరి కుట్ర ఉందని అప్పట్లో చిత్ర బృందం ఆరోపించింది. అయితే ఇన్నాళ్లకు ఎట్టకేలకు 'కేరళ స్టోరీ' ఓటీటీ రిలీజ్ కి ముహూర్తం కుదిరింది.

గతేడాది అత్యధిక వసూళ్లు రాబట్టిన హిందీ చిత్రాలలో ఒకటిగా 'ది కేరళ స్టోరీ' నిలిచింది. సుదీప్తో సేన్ దర్శకత్వంలో విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించిన ఈ చిత్రంలో అదా శర్మ, యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలు పోషించారు. రూ.20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా.. 2023 మే 5న విడుదలై వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.300 కోట్ల గ్రాస్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. 

అయితే ఏవో కారణాల వల్ల ఈ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ స్ట్రీమింగ్ రైట్స్ తీసుకోవడానికి ఓటీటీ సంస్థలు ముందుకు రాలేదు. దీని వెనుక కొందరి కుట్ర ఉందని అప్పట్లో దర్శకుడు సుదీప్తో సేన్ ఆరోపించాడు. మా సినిమా విజయం పరిశ్రమలోని కొందరిని కలవరపాటుకు గురి చేసిందని, దీంతో వారు కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని, ఏదైనా ప్రముఖ ఓటీటీ సంస్థ నుంచి ఆఫర్ వస్తూందేమోనని ఎదురుచూస్తున్నామని అన్నాడు. మొత్తానికి ఇన్నాళ్లకు ఆయన ఎదురుచూపులు ఫలించాయి.

థియేటర్లలో విడుదలైన తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతోంది 'కేరళ స్టోరీ'. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ ని జీ5 దక్కించుకుంది. ఫిబ్రవరి 16 నుంచి ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు తాజాగా జీ5 సంస్థ ప్రకటించింది.