English | Telugu

భూల్‌భుల‌య్యా3లో నాయిక ఎవ‌రు?

భూల్‌భుల‌య్యా సినిమాకు సీక్వెల్ 2021లో రిలీజ్ అయిన విష‌యం గుర్తుందా? బాలీవుడ్ దిగాలుగా ఉన్న‌ప్పుడు హిట్‌తో ఊర‌డించిన సినిమాల్లో భూల్‌భుల‌య్యా2 కూడా ఒక‌టి. కార్తిక్ ఆర్య‌న్ హీరోగా న‌టించారు. అద్భుత‌మైన క‌థ‌, మంచి న‌టన‌, గుడ్ కామెడీ పంచ్ లైన్స్ ఈ సినిమాకు ప్ల‌స్ అయ్యాయి. ఈ సినిమాకు త్రీక్వెల్ రెడీ అవుతోంది అని గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తూనే ఉన్నాయి. కార్తిక్ ఆర్య‌న్ భూష‌ణ్ కుమార్‌, అనీస్ బ‌జ్మీతో క‌లుస్తున్నార‌న్న‌ది న‌యా వార్త‌. భూల్ భుల‌య్యా త్రీక్వెల్ గురించి వార్త‌లు బ‌య‌టికి రాగానే అంద‌రూ మంజులిక గురించి ఆరా తీస్తున్నారు. థ‌ర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో ఆ కేర‌క్ట‌ర్‌లో ఎవ‌రు క‌నిపిస్తార‌న్న‌ది అంద‌రికీ ఆస‌క్తి క‌లిగిస్తున్న విష‌యం.

బాలీవుడ్‌లో ఇప్పుడు మ‌ళ్లీ రీ ఎంట్రీ ఇస్తున్నారు రాణీముఖ‌ర్జీ. ఎన్నో పాత్ర‌ల‌కు త‌న‌దైన శైలిలో జీవం పోశారు రాణీముఖ‌ర్జీ. ఇప్పుడు ఈ థ‌ర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్‌లో మంజులిక కేర‌క్ట‌ర్‌లో ఆమె న‌టిస్తే చూడాల‌న్న‌ది కొంద‌రి కోరిక‌. మ‌రికొంద‌రి మ‌న‌సుల్లో తాప్సీ మెదులుతున్నారు. నూడుల్స్ జుట్టు వేసుకుని ఇలాంటి సీరీస్‌లో తాప్సీ క‌నిపిస్తే, కేర‌క్ట‌ర్ అద్భుతంగా పేలుతుంద‌నే వార్త‌లూ ఉన్నాయి. భూల్ భుల‌య్యా సీరీస్‌లో మంజులిక పాత్ర‌లో ఒక్క‌సారైనా మా తాప్సీని చూపించండి అని వేడుకుంటున్న‌వారు కూడా ఉన్నారు. అంద‌రినీ ప‌రిశీలించ‌మంటున్న వారు ఫైర్‌బ్రాండ్ కంగ‌నను మాత్రం వ‌దిలేస్తారా? ఆమె గురించి కూడా ఉప్పందుతోంది.

సౌత్‌లో చంద్ర‌ముఖి2లో న‌టిస్తున్న కంగ‌న‌, నార్త్ లో మంజులిక పాత్ర‌ను అవ‌లీల‌గా పోషించ‌గ‌ల‌ర‌నే కాన్ఫిడెన్స్ క‌నిపిస్తోంది. దీపిక ప‌దుకోన్ కూడా ఈ కేర‌క్ట‌ర్‌కి చ‌క్క‌గా స‌రిపోతార‌న్న‌ది ఇంకో వెర్ష‌న్‌. ఆల్రెడీ యాక్ష‌న్ మూవీస్ చేస్తున్న దీపిక‌కు, ఈ సినిమా చాలా వైవిధ్యంగా ఉంటుందంటున్నారు క్రిటిక్స్. విద్యాబాల‌న్‌, ట‌బు కాకుండా ఇంకెవ‌రినైనా తీసుకోండి అన్న‌ది మ‌రికొంద‌రి వెర్ష‌న్‌.