English | Telugu

కంగ‌న అకౌంట్‌ను ప‌ర్మినెంట్‌గా స‌స్పెండ్ చేసిన ట్విట్ట‌ర్‌! రీజ‌న్ ఇదే!!

బాలీవుడ్ న‌టి, ఫైర్ బ్రాండ్ కంగ‌నా ర‌నౌత్ ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ను శాశ్వంతంగా స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు సోష‌ల్ మీడియా దిగ్గ‌జాల్లో ఒక‌టైన ట్విట్ట‌ర్ ప్ర‌క‌టించింది. ప‌దే ప‌దే కాంట్ర‌వ‌ర్షియ‌ల్ కామెంట్స్‌ను పోస్ట్ చేయ‌డం ద్వారా ఆమె ట్విట్ట‌ర్ రూల్స్ అండ్ రెగ్యులేష‌న్స్‌ను ఉల్లంఘించార‌ని అది తెలిపింది. ఆమె విద్వేష‌పూరిత‌మైన‌, అభ్యంత‌ర‌క‌ర‌మైన బిహేవియ‌ర్ వ‌ల్ల ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు ట్విట్ట‌ర్ చెప్పింది.

ఇటీవ‌ల ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల త‌ర్వాత కంగ‌నా ర‌నౌత్ చేసిన ట్వీట్ కాంట్ర‌వ‌ర్సీ సృష్టించింది. వెస్ట్ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీని టార్గెట్ చేస్తూ, ఆమెను కించ‌ప‌రిచేలా ఆ ట్వీట్ ఉండ‌టంతో అన్ని వైపుల నుంచీ విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చాక ప‌శ్చిమ బెంగాల్‌లో హింస చెల‌రేగే అవ‌కాశం ఉంద‌ని జ‌ర్న‌లిస్ట్ స్వ‌ప‌న్‌దాస్ గుప్తా ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌న అభిప్రాయం వ్య‌క్తం చేశారు. దీనికి కంగ‌న ఇచ్చిన రిప్లై ట్వీట్ కాంట్ర‌వ‌ర్సీ క్రియేట్ చేసింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2000వ సహస్రాబ్దం ప్రారంభంలో ప్రదర్శించిన విరాట్ స్వరూపంతో మమతా బెనర్జీని లొంగదీయాలని కంగన ఈ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇది దుమారం సృష్టించింది దీంతో ఆమె ట్విట్ట‌ర్ హ్యాండిల్‌ను ప‌ర్మినెంట్‌గా సస్పెండ్ చేస్తూ ట్విట్ట‌ర్ నిర్ణ‌యం తీసుకుంది.

తన అకౌంట్‌ను ట్విట్ట‌ర్‌ సస్పెండ్ చేయడంపై కంగన స్పందిస్తూ, తన వాదనను ట్విటర్ రుజువు చేసిందన్నారు. బ్రౌన్ పీపుల్‌ను బానిసలుగా చేసుకునే హక్కు తమకు ఉందని శ్వేత జాతీయులు పుట్టుక నుంచి భావిస్తారనీ, ట్విటర్ యాజమాన్యం అమెరికన్లు కాబ‌ట్టే ఈ ప‌ని చేశార‌నీ అన్నారు. ఏం చేయాలో, ఏం మాట్లాడాలో, ఏం ఆలోచించాలో మనకి చెప్పాలని వాళ్లు అనుకుంటారని ఆమె చెప్పారు. అదృష్టవశాత్తూ మాట్లాడటానికి తనకు అనేక వేదికలు ఉన్నాయనీ, వాటి ద్వారా తాను తన గొంతు వినిపిస్తాననీ అన్నారు. అయితే వేలాది సంవత్సరాలుగా హింస, బానిసత్వం, సెన్సార్‌షిప్‌కు గురవుతున్న మన దేశ ప్రజల కోసం తన హృదయం తల్లడిల్లుతోందని కంగ‌న‌ చెప్పారు.