English | Telugu

దీపిక‌కు కొవిడ్.. హాస్పిట‌ల్‌లో ప్ర‌కాశ్ ప‌డుకోనే!

క‌రోనా సెకండ్ వేవ్ ఏమాత్రం ఆగ‌నంటోంది. ఎన్ని ర‌కాల నిబంధ‌న‌లు అమ‌లు చేస్తున్నా దాని విజృంభ‌ణ కొన‌సాగుతూనే ఉంది. దాని దెబ్బ‌కు అనేక‌మంది పిట్ట‌ల్లా రాలిపోతున్న వార్త‌లు నిత్యం చూస్తున్నాం. ఇటీవ‌ల దీపిక ప‌డుకోనే తండ్రి ప్ర‌ఖ్యాత బ్యాడ్మింట‌న్ ఆట‌గాడు ప్ర‌కాశ్ ప‌డుకోనే కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయి, ఆరోగ్యం క్షీణించ‌డంతో హాస్పిట‌ల్ పాల‌య్యారు. లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం దీపిక కూడా కొవిడ్ బారిన ప‌డింది. టెస్ట్‌లో ఆమెకు పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యింది.

65 సంవ‌త్స‌రాల ప్ర‌కాశ్ ప‌డుకోనే కొవిడ్ ల‌క్ష‌ణాలు తీవ్రంగా ఉండి, అస్వ‌స్థ‌త‌కు గుర‌వ‌డంతో బెంగ‌ళూరులోని హాస్పిట‌ల్‌లో చికిత్స నిమిత్తం చేరారు. ప్ర‌స్తుతం ఆయ‌న ప‌రిస్థితి మెరుగ‌య్యింద‌నీ, కోలుకుంటున్నార‌నీ స‌మాచారం. మ‌రో రెండు రోజులు అబ్జ‌ర్వేష‌న్‌లో ఉంచి, ఆయ‌న కోలుకున్నార‌ని స్ప‌ష్ట‌మైతే డిశ్చార్జి చేసే అవ‌కాశాలున్నాయి.

ప్ర‌కాశ్ త‌ర్వాత ఆయ‌న భార్య ఉజ్జ‌ల‌, చిన్న‌కుమార్తె అనీషా కూడా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయ్యారు. తండ్రికి ఆరోగ్యం బాగా లేద‌ని తెలియ‌డంతో ఇటీవ‌ల పుట్టింటికి వ‌చ్చింది దీపిక‌. తాజాగా ఆమెకు కూడా టెస్ట్‌లో పాజిటివ్ అని తేలింది. సెకండ్ వేవ్‌లో క‌రోనావైర‌స్ య‌మ డేంజ‌ర‌స్‌గా క‌నిపిస్తుండ‌టంతో దీపిక అభిమానులు ఒకింత ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. ఆమెతో పాటు, ఆమె ఫ్యామిలీ అంతా త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ప్రార్థిస్తున్నారు.