English | Telugu
"వాళ్లు నా కెరీర్‌ను నాశనం చేయాలనుకున్నారు".. గోవిందా సెన్సేషనల్ కామెంట్
Updated : Mar 15, 2021
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ దురదృష్టకర మృతి అనంతరం, ఎన్నడూ లేని విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో నెపోటిజం మీదా, 'లోపలివాళ్లు-బయటివాళ్లు' అనే అంశం మీదా చర్చలు నడుస్తూనే ఉన్నాయి. లేటెస్ట్‌గా ఇండస్ట్రీలోని నెపోటిజంపై మాట్లాడాడు స్టార్ యాక్టర్ గోవిందా.
తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఫిల్మ్ ఇండస్ట్రీలోని వ్యక్తుల పక్షపాత ధోరణిని ప్రశ్నించిన ఆయన, తన గురించి కూడా కొన్ని షాకింగ్ విషయాలు వెల్లడించాడు. తాను ఇదివరకటి గోవిందాను కాదనీ, తానిప్పుడు డ్రింక్ చేయడమే కాకుండా స్మోకింగ్ కూడా చేస్తున్నాననీ తెలిపాడు.
'కూలీ నెంబర్ 1' రీమేక్ గురించి కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు గోవిందా. 1995లో ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ మూవీని ఇటీవల వరుణ్ ధావన్‌తో ఆయన తండ్రి డేవిడ్ ధావన్ రీమేక్ చేసిన విషయం తెలిసిందే. రీమేక్‌కు నెగటివ్‌గా స్పందన రావడంపై ప్రశ్నించినప్పుడు, కామెంట్ చేయడానికి నిరాకరించాడు గోవిందా. ఆ రీమేక్‌పై చాలా డబ్బునూ, చాలా మంది సమయాన్నీ కేటాయించారనీ, అందువల్ల దానిపై తాను జడ్జిమెంట్ ఇవ్వననీ, తప్పుగా మాట్లాడననీ స్పష్టం చేశాడు.
గడచిన దశాబ్దంనర కాలంలో తన సినిమాల ద్వారా దాదాపు రూ. 16 కోట్లు నష్టపోయినట్లు గోవిందా వెల్లడించాడు. "గత 14-15 సంవత్సరాలలో నేను పెట్టుబడి పెట్టిన దాంట్లో దాదాపు రూ. 16 కోట్లు నష్టపోయాను. ఇండస్ట్రీలోని వ్యక్తులే నాతో దారుణంగా వ్యవహరించారు. నా సినిమాలకు థియేటర్లు దొరకలేదు. వాళ్లు నా కెరీర్‌ను నాశనం చేయాలనుకున్నారు కానీ అలా జరగలేదు." అని ఆయన చెప్పాడు.
ఏ ఈడాది తాను సిల్వర్ స్క్రీన్‌పై తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నానని ఆయన తెలిపాడు. చివరిసారిగా ఆయన 'రంగీలా రాజా' (2019) సినిమాలో డబుల్ రోల్‌లో కనిపించాడు.