English | Telugu
'మురారి' హీరోయిన్ ఫ్యామిలీ గురించి మీకు తెలుసా?
Updated : Mar 14, 2021
మణిరత్నం బ్లాక్‌బస్టర్ మూవీ 'బొంబాయి'లో "హమ్మా హమ్మా" సాంగ్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించి, మహేశ్ సరసన నటించిన 'మురారి'తో నేరుగా టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చి, తొలి సినిమాతోటే ఆరాధ్య తారగా మారింది బాలీవుడ్ బ్యూటీ సోనాలీ బెంద్రే. హిందీలో చాలా సినిమాలు చేసినా, అక్కడ స్టార్ హీరోయిన్ కాలేకపోయిన ఆమె తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా, ఇక్కడ టాప్ హీరోయిన్‌గా పేరు పొందింది.
ఇంద్ర, ఖడ్గం, మన్మథుడు, శంకర్‌దాదా ఎంబీబీఎస్ సినిమాలు ఆమెకు ఎంతో పేరు తెచ్చాయి. ఇప్పటికే 'మురారి'లో మహేశ్, సోనాలీ జోడీని చూసి ముచ్చటపడని వాళ్లు ఉండరు. అలాగే 'మన్మథుడు'లో నాగార్జునతో కానీ, 'శంకర్‌దాదా ఎంబీబీఎస్'లో చిరంజీవితో కానీ ఆమె కెమిస్ట్రీ సూపర్బ్. 'శంకర్‌దాదా' సినిమా చేసిన 2004లోనే ఆమె సినిమాల నుంచి తప్పుకుంది. దానికి రెండేళ్ల క్రితమే ఆమె ప్రొడ్యూసర్ గోల్డీ బెహల్‌ను పెళ్లాడింది.
సోనాలీ బాగా చదువుకున్న మహారాష్ట్రియన్ అమ్మాయి. గోల్డీ ఆమెలా ఎక్కువ చదువుకున్న వ్యక్తి కాదు. పైగా అతను పంజాబీ. ఆ ఇద్దరూ ప్రేమలో పడినప్పుడు, సోనాలీ కుటుంబం వారి ప్రేమను అంగీకరించలేదు. కానీ తన అమ్మానాన్నలను సోనాలీ కన్విన్స్ చేసింది. గోల్డీపై కూతురి బలమైన ప్రేమను చూసి వారి పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వక తప్పలేదు వారికి. 2002 నవంబర్ 12న వైభవంగా జరిగిన వేడుకలో సోనాలీ, గోల్డీ దంపతులయ్యారు. ఆ తర్వాత కూడా ఆమె నటనా జీవితానికి గోల్డీ అభ్యంతరపెట్టలేదు. అయితే కొడుకు రణవీర్ పుట్టాక, అతడి ఆలనా పాలనా చూసుకోవడం కోసం నటనకు స్వస్తి చెప్పేసింది సోనాలీ.
ఎంతో ఆనందమయంగా సాగుతున్న వారి జీవితం ఒక్కసారిగా కుదుపుకు గురైంది. 2018లో సోనాలీకి కేన్సర్ అనే విషయం బయటపడింది. ఆ ఏడాది జూలై 4న తనకు కేన్సర్ అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉందనే విషయం వెల్లడైందనీ, న్యూయార్క్ సిటీ హాస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నాననీ తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ప్రపంచానికి తెలియజేసింది సోనాలీ. దాంతో యావత్ భారతీయ చిత్రసీమ షాక్‌కు గురైంది. భార్యను ఎంతగానో ప్రేమించే గోల్డీ పరిస్థితి చెప్పనలవి కాదు. అయినా గుండె నిబ్బరంతో తన జీవిత సహచరికి అండగా నిలిచాడు. ఆమెకు ధైర్యాన్నిచ్చాడు. అతడిచ్చిన సపోర్ట్‌తో కేన్స్‌ర్‌ను జయించింది సోనాలీ.
గత నవంబర్ 12కి సోనాలీ, గోల్డీ దాంపత్య జీవితానికి 18 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా సోనాలీతో దిగిన ఓ సెల్ఫీ పిక్చర్‌ను తన ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ ద్వారా షేర్ చేసిన గోల్డీ, "మాకు హ్యాపీ 18వ వార్షికోత్సవం. నా జీవితంలో ఆమెను కలిగివుండటం నాకు లభించిన వరం. దీనికి వేరే మార్గం లేదు." అని రాసుకొచ్చాడు. ఇప్పుడు భర్త గోల్డీ, పదిహేనేళ్ల కొడుకు రణవీరే సోనాలీ ప్రపంచమంతా.