English | Telugu
"తమిళుల్ని ఎందుకు తప్పుగా చూపిస్తాం?".. 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' డైరెక్టర్ రాజ్
Updated : May 25, 2021
తమిళుల్ని టెర్రరిస్టులుగా చూపిస్తున్న 'ద ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్‌ను ప్రసారం కాకుండా బ్యాన్ చెయ్యాలని తమిళ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిన్న ఎండీఎంకే నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైకో సైతం ఈ విషయమై చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర సమాచార-ప్రసార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్‌కు ఓ లేఖ కూడా రాశారు. అయితే తమ వెబ్ సిరీస్‌లో తమిళుల్ని తప్పుగా చిత్రించామని జరుగుతున్న ప్రచారాన్ని ఆ సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరు తిప్పికొట్టారు.
హాఫ్-తమిళియన్ అయిన రాజ్, "ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లోని యూనిట్ సభ్యుల్లో ఎక్కువమంది తమిళులే. ఇందులో తమిళియన్ క్యారెక్టర్ పోషించిన సమంత అక్కినేని తమిళనాడును తన ఇల్లుగా పరిగణిస్తారు. నేను సగం తమిళుడినే. ఈ షోలోని ఇతర నటులు, సాంకేతిక నిపుణులు తమిళనాడుకు చెందినవాళ్లే. పైగా, మేమంతా తమిళనాడు కల్చర్, రాజకీయాల విషయంలో చాలా సున్నితంగా ఉండే బాధ్యతాయుత పౌరులం. తమిళుల్ని తప్పుగా మేమెందుకు చూపిస్తాం?" అని ఆయన ఎదురు ప్రశ్నించారు. జూన్ 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'ద ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2' స్ట్రీమింగ్ కానున్నది.
"సమంత చేసిన పాత్రను సిరీస్ చూశాక జడ్జ్ చేయాలి కానీ, ట్రైలర్ చూసి కాదు." అని కూడా రాజ్ అన్నారు. ఈ షోలో ఓ టెర్రరిస్ట్ గ్రూప్‌కు చెందిన రాజీ అనే పాత్రను సమంత పోషించగా, అండర్ కవర్ ఏజెంట్ శ్రీకాంత్ తివారీగా మెయిన్ లీడ్‌ను మనోజ్ బాజ్‌పేయి చేశాడు. ఆయన భార్య పాత్రలో ప్రియమణి కనిపించనున్నది.