English | Telugu

22 దేశాల్లో టాప్ 10లో తాప్సీ ఫిల్మ్‌!

నెట్‌ఫ్లిక్స్ సహ-సిఈఓ, చీఫ్ కంటెంట్ ఆఫీసర్ టెడ్ సరండోస్ ఇచ్చిన ఒక‌ ఇంటర్వ్యూలోని సారాంశాన్ని తాప్సీ పన్నూ పంచుకుంది. ఎందుకంటే ఆమె చిత్రం 'హసీన్ దిల్‌రూబా' ప్రపంచవ్యాప్తంగా ఆ స్ట్రీమింగ్ యాప్‌లో చాలా ప్రజాదరణ పొందింది. ఆయ‌న‌కు ఓ ట్వీట్‌లో కృతజ్ఞతలు తెలిపింది తాప్సీ.

"ఫ్ర‌మ్ ద హార్సెస్ మౌత్‌ :) # హసీన్ దిల్‌రూబా సరిహద్దులను ఇంత త్వరగా దాటినందుకు ధన్యవాదాలు" అని రాసింది తాప్సీ. ఆ చిత్రంలో విషపూరిత సంబంధాలు, గృహ హింసను గ్లోరిఫై చేశార‌ని కొంత‌మంది క్రిటిక్స్ తీవ్రంగా విమ‌ర్శించారు. ఆ చిత్రంలోని కంటెంట్‌ను వ్య‌క్తిగ‌త‌మైన‌విగా తీసుకున్న‌వారే అలాంటివి రాశారంటూ తాప్సీ, ఆ సినిమా రైట‌ర్‌ కనికా ధిల్లాన్ ప్రతికూల సమీక్షలను తిప్పికొట్టారు.

'ఫిల్మ్ కంపానియన్‌'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, భారతదేశంలో నెట్‌ఫ్లిక్స్ ప్రాజెక్టుల గురించి టెడ్ స‌రండోస్‌ మాట్లాడారు. "భారతదేశంలో మా పని ఇప్పుడే ప్రారంభమైనట్లు నేను భావిస్తున్నాను. మేము స్థానిక కథకులతో కలిసి పని చేస్తున్నాం. గత సంవత్సరం మా అతిపెద్ద కంటెంట్‌ను ప్రారంభించాం. అది పెరుగుతూనే ఉంది. మా సినిమాలు కొన్ని మన భార‌తీయ ప్రేక్ష‌కుల్లో బాగా ప్రాచుర్యం పొందాయి. 'జగమే తందిరమ్' బాగా ప్రాచుర్యం పొందింది. హసీన్ దిల్‌రూబా 22 వేర్వేరు దేశాలలో మా టాప్ 10లో నిలిచింది.” అని ఆయన చెప్పారు.

వినీల్ మాథ్యూ డైరెక్ట్ చేసిన 'హ‌సీన్ దిల్‌రూబా' మూవీలో తాప్సీ, విక్రాంత్ మాసే, హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే ప్ర‌ధాన పాత్ర‌ధారులు. ఒక సిలిండ‌ర్ పేలి భ‌ర్త మ‌ర‌ణించిన ఘ‌ట‌న‌లో ప్ర‌థ‌మ అనుమానితురాలైన భార్య‌గా తాప్సీ న‌టించింది.